మెరిసిన అర్జున్, గుకేశ్
ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నీ
వార్సా: ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో భారత్‌కు సానుకూల ఫలితా లు వచ్చాయి. క్యాండిడేట్స్ చాంపియన్ గుకేశ్‌తో పాటు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి, మరో గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందలు ముందడుగు వేశారు. తొలి మూడు రౌండ్లలో రెండు ఓటములు, ఒక డ్రాతో సరిపెట్టుకున్న గుకేశ్ రెండు వరుస విజయాలు అందుకున్నాడు. నాలుగో రౌండ్‌లో భారత్‌కే చెందిన ప్రజ్ఞానందను ఓడించిన గుకేశ్ ఐదో రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై విజయాన్ని సాధించాడు. ఇక గుకేశ్ చేతిలో ఓడినప్పటికి ప్రజ్ఞానంద ఐదో రౌండ్‌లో తనకంటే బలమైన ప్రత్యర్థి అయిన నెదర్లాండ్స్‌కు చెందిన అనీశ్ గిరీని ఓడించాడు. ఇక తొలి మూడు గేములను డ్రా చేసుకున్న అర్జున్ నాలుగో రౌండ్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న కిరిల్ చెంకోకు నాలుగో రౌండ్‌లో చెక్ పెట్టాడు. భారత త్రయం గుకేశ్, అర్జున్, ప్రజ్ఞానందలు ఐదు పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక 7 పాయింట్లతో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), చెంకో (రొమేనియా) సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ర్యాపిడ్‌లో మరో నాలుగు రౌండ్లు మిగిలి ఉన్నాయి.






