సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు ఆసిఫ్ అలీకి అరుదైన గుర్తింపు
రంగారెడ్డి,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలానికి చెందిన రేవంత్ మిత్రమండలి అధ్యక్షుడు మహ్మద్ ఆసిఫ్ అలీకి రాష్ట్రస్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. తెలంగాణ రాష్ట్ర రెండో ఆర్థిక సంఘం (Second State Finance Commission) సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, నమ్మిన వ్యక్తిగా పార్టీలో కొనసాగుతున్న ఆసిఫ్ అలీ.. మొదటి నుండి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, విస్తృత ప్రచారం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన నిరంతర శ్రమ, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ కీలక పదవికి ఆయన పేరును సిఫార్సు చేయగా, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక సంఘం సభ్యుడిగా ఆసిఫ్ అలీ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. తమ ప్రాంత నాయకుడికి రాష్ట్రస్థాయిలో పెద్ద పీట వేయడంపై కడ్తాల్ మండల కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ మిత్రమండలి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






