28 August, 2026 | 4:29 AM

బన్నీ, చెర్రీలకు అరుదైన గుర్తింపు

28-08-2026 12:00 AM

టాలీవుడ్‌(Tollywood)కు చెందిన స్టార్ హీరోలు(Star heroes) అల్లు అర్జున్(Allu Arjun), రామ్‌చరణ్(Ram Charan) జాతీయ స్థాయిలో సత్తాచాటారు. భారతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలతో ‘ఫోర్బ్స్ ఇండియా’(Forbes India) రూపొందించిన ప్రతిష్టాత్మకమైన ‘షో స్టాపర్స్ 2026’ జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా వినోదం, క్రీడలు, పాపులర్ కల్చర్‌కు చెందిన 100 మంది సెలబ్రిటీలతో రూపొందించిన ఈ జాబితాలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి వీరిద్దరే ఉండడం విశేషం.

అంతేకాదు, తాజా ‘షో స్టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లో మెరిశారు. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఉన్న అల్లు అర్జున్ క్రేజ్.. ఇప్పుడు ‘ఫోర్బ్స్ ఇండియా’ కవర్ పేజీ రూపంలో తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన స్టార్ ఇమేజ్ నుంచి జాతీయ స్థాయి స్టార్‌గా ఎదిగారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కూడా తాజా షోస్టాపర్స్ జాబితాలో స్థానం సంపాదించారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్.. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌లో కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న వేళ.. టాలీవుడ్ నుంచి ఇద్దరు అగ్ర కథానాయకులకు దేశంలోని అత్యంత ప్రభావశీల సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కడం తెలుగు సినిమా స్థాయిని మరోసారి చాటిచెప్పినట్టయింది.  

బాలీవుడ్, సౌత్ స్టార్లకూ చోటు..

ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026 జాబితాలో ఉత్తరాది, దక్షిణాది నటీనటులకు కూడా చోటు దక్కింది. బాలీవుడ్ నుంచి షారుఖ్‌ఖాన్, ప్రియాంక చోప్రా జోనస్, రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. దక్షిణాది నుంచి రజనీకాంత్, కమల్‌హాసన్, దళపతి విజయ్, మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి అగ్ర తారలు కూడా షోస్టాపర్స్‌గా నిలిచారు.