24 June, 2026 | 1:15 AM

చర్ల వ్యవసాయ సహకార సంఘానికి కేంద్ర ప్రభుత్వ అరుదైన గుర్తింపు

24-06-2026 12:50 AM
  1. ఎస్టీవో సహకార పరిధిలో చర్ల పీఏసీఎస్ సెలెక్ట్..
  2. ఏసీ గోడౌన్లు, 2 కోట్ల వరకు రుణ సౌకర్యం.. రైతుల్లో హర్షం

చర్ల, జూన్ 23 (విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహకార రంగానికి అరుదైన గౌరవం దక్కింది. చర్ల మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ( పిఎసిఎస్ ) కేంద్ర ప్రభుత్వ ‘సహకార ఆధారిత రైతు ఉత్పత్తుల సంఘం’ ( ఎఫ్ పి ఓ ) పథకానికి ఎంపికైంది. ఎస్టీవో సహకార పరిధిలో ఈ సంఘం సెలెక్ట్ కావడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయని కార్యదర్శి రామచంద్ర ప్రభు వెల్లడించారు.

చర్ల పీఏసీఎస్ కార్యదర్శి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ, ‘కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పీఏసీఎస్లలో మన చర్ల సంఘం కూడా ఉండటం గర్వకారణం. రైతు ఉత్పత్తుల సంఘంలో మొత్తం 750 మంది సభ్యులకు అవకాశం ఉంది. ఇప్పటికే 600 మంది రైతులు చేరారు. ఇంకా 150 మంది సభ్యత్వానికి అవకాశం ఉంది‘ అని తెలిపారు. పట్టా భూమి ఉన్న రైతులు, సొసైటీలో సభ్యత్వం ఉన్న వారు మాత్రమే అర్హులని వివరించారు.

వాటా సొమ్ము: ఒక్కో రైతు రూ 2వేలు చెల్లిస్తే, కేంద్రం రూ 2 వేలు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. అంటే రైతు ఖాతాలో రూ 4వేలు జమ అవుతుందన్నారు.

రైతుబడి: మొత్తం షేర్ మొత్తం రూ 30వేలు దాటితే, ‘రైతుబడి’ కింద ప్రభుత్వం రూ 15వేలు  ప్రోత్సాహకం అందిస్తుందని  

రుణ సౌకర్యం: సంఘం టర్నోవర్ రూ 2 కోట్లు దాటిన తర్వాత ఏసీ గోడౌన్లు, కోల్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి కేంద్రం 100% గ్రాంట్ ఇస్తుందని ఆయన తెలిపారు 

‘ఇకపై మన రైతులే మిర్చి, పత్తి, వరి వంటి పంటలను నేరుగా కొనుగోలు చేసి, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి మార్కెట్కు పంపవచ్చు. దళారుల ప్రమేయం లేకుండా మనమే ధర నిర్ణయించుకోవచ్చు. ఏసీ గోడౌన్లు వస్తే నిల్వ చేసి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు‘ అని రామచంద్ర ప్రభు వివరించారు.  కేంద్ర పథకానికి ఎంపిక కావడంతో చర్ల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇన్నాళ్లు దళారుల చేతిలో నష్టపోయాం. ఇప్పుడు మన సంఘమే కంపెనీగా మారి మన పంటను మనమే అమ్ముకునే రోజులు వచ్చాయి.

రూ 2 కోట్ల రుణంతో గోడౌన్లు కట్టుకుంటే ఇక మనకు తిరుగుండదు‘ అని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మిగిలిన 150 స్థానాల కోసం అర్హులైన రైతులు పట్టా పాస్బుక్, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, పీఏసీఎస్ సభ్యత్వ పుస్తకంతో చర్ల సహకార సంఘ కార్యాలయంలో సంప్రదించాలని కార్యదర్శి కోరారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.