చిరంజీవి హాస్పిటల్‌లో అరుదైన చికిత్స
- లివర్లో 5 సెం.మీ చేప ముల్లు తొలగింపు
- రక్తప్రసరణ ఆగిన వృద్ధుడికి పునర్జీవం
ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): అత్యంత అరుదైన, క్లిష్టమైన రెండు శస్త్ర చికిత్సలను కూకట్ పల్లి చిరంజీవి హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసినట్లు హాస్పిటల్ సీఈఓ, వాస్క్యులర్ సర్జన్ డా.సంజీవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య బృందంతో కలసి అయన వివరాలు వెల్లడించారు.
గత మూడు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్స్కు వచ్చిన రాజమండ్రికి చెందిన 50 ఏళ్ల మహిళకు లివర్లో సుమారు 5 సెం.మీ పొడవైన చేప ముల్లు లివర్లో ఇరుక్కుపోయి ఉన్నట్లు స్కానింగ్లో తేలిందన్నారు. ఈ ముల్లు పేగుల నుంచి లివర్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు దారితీసిందన్నారు. వెంటనే శస్త్రచికిత్సతో ముల్లును తొలగించినట్లు తెలిపారు.
మరో కేసులో 80 ఏళ్ల వృద్ధుడు కాలిలో రక్తప్రసరణ ఆగిపోవడంతో పాటు ప్రోస్టేట్ గ్రంథి సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ నేపథ్యంలో అత్యాధునిక రివాస్కులరైజేషన్ విత్ యాంజియోప్లాస్టీ అండ్ ఐవీఎల్ చేసి కాలు కాపాడినట్లు తెలిపారు.
అలాగే వృద్ధుడికి ఉన్న ప్రోస్టేట్ సమస్యకు ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (పీఏఈ) ద్వారా సమస్యను సరిచేశామని తెలిపారు. ఈ సమావేశంలో వైద్య బృందం డా.అనీల్, డా.భార్గవ్, డా. లీనా, డా.తైబా, డా.శిల్ప, డా.పావని, డా. వంశీ, డా.సుందర్ సింగ్ తదితకరలు పాల్గొన్నారు.






