22 July, 2026 | 3:29 PM

హన్మకొండలో భట్టి విక్రమార్క నిరసన

22-07-2026 02:50 PM

హన్మకొండ: ఢిల్లీ జంతర్మంతర్ వద్ద యువతపై పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటు సభ్యులు ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ హన్మకొండ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిరసనకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు.

ఢిల్లీలో యువతపై జరిగిన పోలీస్ దమనకాండను వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను అక్రమంగా అరెస్టులను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను కర్కశంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీతో దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేసింది. నీట్ అక్రమాలపై ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తున్న అమాయక విద్యార్థులు, ఆడపిల్లల పట్ల పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి, లాఠీఛార్జ్ చేయడం అత్యంత దుర్మార్గమన్నారు.

నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) తక్షణమే రాజీనామా చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. సమస్యలు వినడం మానేసి ప్రశ్నించిన వారిపై దాడులు, అరెస్టులు చేయడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. దేశ యువత భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ దిక్సూచిలా నిలిచి పోరాడుతున్నారని కొనియాడారు.

లాఠీలతో విద్యార్థుల గొంతును, అరెస్టులతో రాహుల్ గాంధీ పోరాటాన్ని ఆపలేరన్న ఉపముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆఖరి వరకు పోరాడతాయని హామీ ఇచ్చారు. విద్యావ్యవస్థను రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ చేపడుతున్న ఈ పోరాటానికి దేశంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. అటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.