22 July, 2026 | 3:12 PM

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం: డీఎంహెచ్‌ఓ కె. కృష్ణ

22-07-2026 02:34 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, చేయించుకోవడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. కృష్ణ హెచ్చరించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, గర్భిణుల రికార్డులు, ఫారం-ఎఫ్‌లను పరిశీలించారు. గర్భిణులతో మాట్లాడి స్కానింగ్ అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

చట్ట ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, చేయించుకున్నా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ చేసి గర్భస్రావాలు నిర్వహించే వైద్యులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారని చెప్పారు. అవసరమైతే మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసి వైద్యుల ప్రాక్టీస్‌ను నిలిపివేయించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తమ సేవల ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.