21 May, 2026 | 1:31 PM

జనవరి నుంచి తెల్లరేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం

23-08-2024 04:00 AM

త్వరలో రేషన్ డీలర్ల భర్తీ

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు దారులకు తీపి కబురు అందించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు  పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తక్షణమే డీలర్‌షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

అలాగే రేషన్ డీలర్ల ఆదాయం పెంచే ఆలోచన చేస్తున్నటు,్ల వారి డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,629 చౌకధరల దుకాణాల డీలర్ల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్‌వాడీ , మధ్యాహ్నం భోజనాలలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటే మార్పు వస్తుందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న వంట గ్యాస్ సబ్సిడీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా  చర్యలు తీసుకోవాలన్నారు. సబ్సిడీ  లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విషయం వారికి స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డీఎస్ చౌహాన్,  అధికారులు పాల్గొన్నారు. 

‘నెల్లికల్లు’కు భూసేకరణ అడ్డు కావొద్దు

 నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ఎట్టి పరిస్థితిల్లోనూ అడ్డు కాకూడదని అధికారులకు నీటి పారుదల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఏప్రిల్ చివరి నాటికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పురోగతిపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. భూసేకరణ కోసం రైతులతో సంప్రదింపులు జరిపి పనులను వేగవంతం చేయాలన్నారు. అదే సమయంలో అటవీశాఖ భూములకు అదనంగా చెల్లించాల్సిన చెల్లింపుల ప్రతిపాదనలను వెంటనే పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ23 కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు పెరిగిన విద్యుత్ బకాయిల ప్రతిపాదనలు తక్షణమే పంపాలన్నారు.

అలాగే నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించనున్న చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడంతో పాటు మొత్తం ఐదు చెక్ డ్యామ్‌లకు తక్షణమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఎంఆర్‌పీ పరిధిలోని లో లెవల్ కెనాల్‌లో జంగిల్ కటింగ్ వెంటనే మొదలు పెట్టాలని మంత్రి సూచించారు. ఎన్‌ఎస్పీ కెనాల్ పరిధిలో  అవసరమైన చోట మరమ్మతులు మొదలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయదీర్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, కలెక్టర్ నారాయణ రెడ్డి, సీఈలు అజయ్ కుమార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.