రవితేజ దొంగ ఆట

29-04-2024 12:05:00 AM

కథ నచ్చి చెప్పింది చెప్పినట్టు తియ్యగలడు అనే నమ్మకం వస్తే సినిమాని పట్టాలెక్కించేయడం రవితేజకి రివాజు. మరే లెక్కల్నీ ఆయన లెక్క చేయరు. ఇదే కోవలో అనుదీప్ కె.వి. దర్శకుడిగా ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు రవితేజ. గత కొంతకాలంగా తనదైన శైలి హాస్యానికి దూరంగా ఉన్న ఆయన, మళ్ళీ అటువంటి చిత్రంతో తన అభిమానులను కడుపుబ్బా నవ్వించాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ‘జాతిరత్నాలు’, ‘ప్రిన్స్’ చిత్రాలతో కామెడీ పరంగా తనదైన మార్క్ వేసిన అనుదీప్‌తో చేయి కలిపారు. ఈ మేరకు అనుదీప్ రాసుకున్న కథ దొంగ నేపథ్యంలో ఉండనుందట. దాంతో వీరిద్దరి కలయికలో రానున్న సినిమాకి దొంగ అనే టైటిల్ ఖాయం చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ఈ రెండు పాత్రల్లోనూ కనపడనున్నది రవితేజ.. కాదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్‘ సినిమా చేస్తున్నారు రవితేజ. హిందీ చిత్రం ‘రెయిడ్’ (2018)కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే తెరమీదికి రానుండగా, తర్వాత నూతన దర్శకుడైన భాను భోగవరపుతో తన 75వ సినిమా చేయనున్నారాయన. ఈ సినిమా 2025 సంక్రాంతికి తెరమీదికి రానుంది.