14 July, 2026 | 9:36 AM

బ్యాంక్‌లపై ఆర్బీఐ కొరడా

30-04-2024 12:05 AM

అనైతిక విధానాలు పాటిస్తున్నాయంటూ తీవ్ర విమర్శ

అధిక చార్జీలను రిఫండ్ చేయాలంటూ ఆదేశాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఖాతాదారుల నుంచి అధికంగా వసూలు చేసిన చార్జీలను రిఫండ్ చేయాలని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలను రిజర్వ్‌బ్యాంక్ ఆదేశించింది. కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వడ్డీలను ఎక్కువగా గుంజుతూ అనైతిక వ్యాపార విధానా లను పాటిస్తున్న ఉదంతాలు కన్పించడంతో  సోమవారం తాజా ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయి. 2003 నుంచి తమ నియంత్రణలో ఉన్న  సంస్థలకు జారీచేస్తున్న ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ మార్గదర్శకాల ప్రకారం రుణదాతలు వడ్డీ విధింపులో న్యాయబద్దమైన విధానాలను అనుసరించాలని, పారదర్శకత పాటించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. తాము జరిపిన పరిశీలనలో బ్యాంకు లు అధిక వడ్డీలను వసూలు చేస్తున్న సందర్భాలు కనిపించాయని ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.  బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణ మంజూరీలు, వడ్డీ, ఇతర చార్జీల అమలుపై వాటి విధానాల్ని సమీక్షించుకుని, దిద్దుబాటు చర్యల్ని చేపట్టాలని ఆర్బీఐ ఆదేశాల్లో పేర్కొంది. వడ్డీ విధింపునకు సంబంధించి అవసరమైతే వ్యవస్థాగతంగా మార్పులు చేయాలని సూచించింది. 

రుణ మంజూరీ తేదీ నుంచే వడ్డీ..

ఆర్బీఐ తన నియంత్రణలోని సంస్థల (బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు) ఖాతాల్ని పరిశీలించినపుడు రుణాన్ని పంపిణీ చేసినప్పటి నుంచి కాకుండా, కొన్ని బ్యాంక్‌లు రుణాల్ని మంజూరుచేసిన తేదీ లేదా రుణ ఒప్పందం కుదిరిన తేదీ నుంచే వడ్డీని వసూలు చేస్తున్నట్టు తేలిందని ఆ సర్క్యులర్‌లో ఆర్బీఐ వెల్లడించింది. చెక్కును కస్టమర్‌కు ఇచ్చినప్పటి నుంచి కాకుండా ఆ చెక్కుపై ఉన్న తేదీ నుంచే వడ్డీని వసూలు చేస్తున్న సందర్భాలను కూడా గమనించినట్టు కేంద్ర బ్యాంక్ తెలిపింది. కొన్ని బ్యాంక్‌లు నెలలో ఏదో ఒక రోజున రుణాన్ని పంపిణీచేసినప్పటికీ, రుణం ఇచ్చిన తర్వాతి రోజులకు వేయాల్సిన వడ్డీని ఆ నెల మొత్తానికి  వర్తింపచేస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది.

కొన్ని బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాయిదాలను ముందుగానే వసూ లు చేసి, పూర్తి రుణ మొత్తానికి వడ్డీ వేస్తున్నాయన్నది. ఇటువంటి ఉదంతాలను అనైతిక విధానాలుగా, నాసిరకం ప్రమాణాలుగా ఆర్బీఐ విమర్శించింది. ‘ఈ అంశాలు రిజర్వ్‌బ్యాంక్‌కు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. అటువంటి విధానాలు పాటించినట్టు ఆర్బీఐ పర్యవేక్షణా బృందాల దృష్టికి వచ్చినపుడు అధికంగా వసూలు చేసిన వడ్డీని, ఇతర చార్జీలను కస్టమర్లకు రిఫండ్ చేయాలంటూ ఆ బృందాలు బ్యాంక్‌ల్ని కోరాయి’ అంటూ సర్యులర్ పేర్కొంది. అలాగే రుణ పంపిణీ కోసం కొన్ని కేసుల్లో మినహా చెక్కులకు బదులు ఆన్‌లైన్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.