14 July, 2026 | 8:25 AM

సెన్సెక్స్ 940 పాయింట్ల ర్యాలీ

30-04-2024 12:05 AM

బ్యాంక్ నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు

ముంబై, ఏప్రిల్ 29: స్వల్ప విరామం తర్వాత స్టాక్ మార్కెట్ మరో పెద్ద ర్యాలీ జరిపింది. బ్యాంకింగ్ షేర్ల నేతృత్వంలో సోమవారంనాటి అప్‌ట్రెండ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ భారీగా 940 పాయింట్లు లాభపడి  74,671 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 990 పాయింట్లకుపైగా పెరిగి 74,720 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. గత శుక్రవారం సెన్సెక్స్ 609 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ తాజాగా 223 పాయింట్లు పెరిగి 22,643 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ బాస్కెట్‌లో 32 షేర్లు లాభపడగా, 18 షేర్లు తగ్గాయి. యూఎస్ 10 ఏండ్ల ట్రెజరీ ఈల్డ్ తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పెరిగాయని, ఈ ప్రభావం భారత్ సూచీలపై కూడా పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గడం, కార్పొరేట్లు స్థిరమైన ఫలితా ల్ని వెల్లడించడం ర్యాలీకి మరో కారణమని తెలిపారు. ఆసియాలో సియోల్, షాంఘై, హాంకాంగ్ సూచీలు లాభాలతో ముగిసాయి.