ఇప్పట్లో రేట్లు తగ్గవంటూ ఆర్బీఐ సంకేతాలు
- ఎటువంటి సాహసం చేయం
పాలసీ విధానాన్ని మార్చడం తొందరపాటే
రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యలు
ముంబై, జూన్ 18: తమ ద్రవ్య పరపతి విధానాన్ని మార్చడం తొందరపాటు కాగలదని, వడ్డీ రేట్ల విషయంలో ‘సాహసం’ చేయ బోమని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. ఒక ఆంగ్లచానల్ బ్రాడ్‌కాస్టర్‌లో దాస్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ 2024 7.2 శాతం వృద్ధిచెందుతున్న విశ్వాసంతో ఆర్బీఐ ఉన్నదన్నారు. ద్రవ్యోల్బణం విషయానికొస్తే మూల ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతున్న దని చెప్పారు. ఈ తరుణంలో పాలసీలో మార్పుచేయడం తొందరపాటు అవుతుందని, ఏ రూపంలోనూ సాహసం కూడదని, ఆర్బీఐ ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నదని తెలిపారు.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఇటీవల సమీక్షలో ప్రస్తుత రెపో రేటును 6.5 శాతం వద్దే అట్టిపెట్టిన సంగతి తెలిసిందే. పాలసీ విధానంపై నిర్ణ యం తీసుకునేందుకు రెండు నెలలకోసారి ఈ సమీక్షలను ఆర్బీఐ నిర్వహిస్తుంది. గత 8 పాలసీ సమీక్షల్లోనూ కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే తాజా సమీక్షలో రేట్లు తగ్గించాలంటూ ఓటుచేసిన సభ్యుల సంఖ్య ఒకటి నుంచి రెండుకు పెరిగింది. ద్రవ్యోల్బణం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుందని, ఈ డౌన్‌ట్రెండ్ కొనసాగుతుందన్న విశ్వాసంతో ఆర్బీఐ ఉన్నదని దాస్ చెప్పారు.
ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌పై కన్ను
స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో జరుగుతున్న అధిక ట్రేడింగ్ పరిమాణాన్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో పాటు తాము కూడా గమనిస్తున్నామని, కానీ అందుకు సంబంధించిన చర్యలు సెబీ తీసుకోవాల్సిందేనని చెప్పారు. వచ్చే వారం వెల్లడయ్యే మార్చి త్రైమాసికపు కరెంటు ఖాతా లోటు 1.2 శాతం లోపునకు తగ్గుతుందని చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో వాణిజ్యలోటు తగ్గిన నేపథ్యంలో కరెంటు ఖాతాలోటు జీడీపీలో 1.2 శాతంగా నమోదయ్యింది.
గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌ల్లో ఇండియాను చేర్చిన తర్వాత బాండ్లలో విదేశీ పెట్టుబడులు పెరిగాయన్న వార్తలపై దాస్ స్పందిస్తూ భవిష్య త్తులో ఏర్పడే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి అవసరమైన విదేశీ మారక నిల్వల్ని పెంచుతున్నామని చెప్పారు. వివిధీకరణ వ్యూహంలో భాగంగా ఫారెక్స్ నిల్వల్లో బంగారాన్ని జతచేస్తున్నామని వెల్లడించారు.






