21 June, 2026 | 7:06 AM

ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 21 శాతం వృద్ధి

19-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ దేశంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 21 శాతం వృద్ధిచెంది రూ.4.62 లక్షల కోట్లకు చేరాయని మంగళవారం ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. తొలి విడత అడ్వాన్సు పన్ను చెల్లింపులకు గడవుతేదీ అయిన జూన్ 15నాటికి అడ్వాన్సు పన్ను వసూళ్లు 27.34 శాతం పెరిగి రూ.1.48 లక్షల కోట్లకు చేరాయని, ఇందులో రూ.1.14 లక్షల కోట్లు కార్పొరేట్ పన్నుల ద్వారా వసూలుకాగా, మిగిలిన రూ.34,470 కోట్లు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చాయని వివరించింది.

ఈ అడ్వాన్సు పన్ను వసూళ్లతో సహా ఏప్రిల్ 1 నుంచి జూన్ 17నాటికి నికరంగా రూ.4,62,664 కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇందులో కార్పొరేట్ ఆదాయపు పన్ను రూ.1,80,949 కోట్లు కాగా, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.2,81,013 కోట్లని పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరం జూన్ 17 వరకూ రూ.53,322 కోట్ల రిఫండ్స్ జారీచేసినట్టు వెల్లడించింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే రిఫండ్స్ 34 శాతం అధికమని తెలిపింది.  రిఫండ్స్‌తో కలిపితే ఏప్రిల్ 1 నుంచి జూన్ 17 వరకూ ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు రూ.5.16 లక్షల కోట్లు. నిరుడు ఇదేకాలంలో స్థూల వసూళ్లు రూ.4.23 లక్షల కోట్లతో పోలిస్తే 22.19 శాతం వృద్ధిచెందాయి.