రిజర్వేషన్లపై చర్చకు సిద్ధమా?

29-04-2024 12:21:47 AM

రాష్ట్రంలో బీసీలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ

విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్యాయం

బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని దుష్ప్రచారం 

అమిత్‌షా ప్రసంగాన్ని కాంగ్రెస్ మార్ఫింగ్ చేసింది 

స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమా?

పాలించే హక్కు సోనియా కుటుంబానికే ఉందా?

మోదీ ప్రభుత్వంపై  అవినీతి ఆరోపణలే లేవు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తుందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. నిజానికి రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లపై, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రిజర్వేషన్లపై మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ మార్ఫింగ్‌చేసి దుష్ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు.

కేంద్రంలో పదేళ్లుగా అధికారానికి దూరమైన ఆ పార్టీ ఏదో ఒకరకంగా తిరిగి అధికారం సంపాదించాలని బీజేపీపై నిందలు వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దేశాన్ని పరిపాలించే హక్కు ఒక్క సోనియాగాంధీ కుటుంబానికే ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో కాంగెస్‌కు ఎక్కడా సానుకూల వాతావరణం కనిపించడంలేదని అన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో అంటే పార్టీ నేతలు కాంగ్రెస్ చోడో అంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతికి ఆస్కారం లేని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. గత కాంగ్రెస్ పాలనకు పదేళ్ల బీజేపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు.  

పదేపదే ఒకటే అబద్ధం

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ ఒకే అబద్ధాన్ని పదేపదే వల్లె వేస్తే ప్రజలు విశ్వసిస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదని కిషన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటూ రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని.. అందుకు కనీసం ఒక్క ఆధారమైనా చూపిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. అంబేద్కర్ ఆశయాలకు, రాష్ట్ర హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గండి కొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అత్యున్నత పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిందే బీజీపీ అని తెలిపారు. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్, ఆదివాసీ అయిన ముర్మును రాష్ట్రపతులను చేసింది బీజేపీ అని, దేశంలో తొలిసారి బీసీ బీజేపీయే ప్రధానిని చేసిందని అన్నారు. 27 మంది బీసీలను కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదేనని తెలిపారు. 12 మంది దళితులను, 8 మంది గిరిజనులను కేంద్ర మంత్రులను చేసిన ఘనత తమదేనని అన్నారు.  

కాంగ్రెస్ నాయకులు ఇంతకు దిగజారుతారా?

అమిత్ షా సిద్దిపేటలో చేసిన ప్రసంగం వీడియోను మార్ఫింగ్ చేసి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ప్రచారం చేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇంతకు దిగజారుతారా? అని మండిపడ్డారు. ఇందుకు కారకులైనవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ‘రేవంత్‌రెడ్డి... హామీలు అమలు చెయ్. లేదంటే చెంపలేసుకుని గద్దె దిగిపో’ అని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఒకటిరెండు సీట్లకే పరిమితం కాబోతున్నదని తెలిపారు.

17 స్థానాల్లో గెలవబోతున్నాం

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య స్పందన వస్తోందని, రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలను తాము కైవసం చేసుకుంటామని కిషన్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పదని, తాము మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేసి తీరుతామని అన్నారు. తాము కాంగ్రెస్ పార్టీలా రాజ్యాంగాన్ని రద్దుచేసి ఎమర్జెన్సీ పెట్టలేదని, పత్రికా స్వేచ్ఛను హరించలేదని, ప్రజాసంఘాలను నిషేధించలేదని, ప్రజా సంఘాల నాయకులను జైళ్లో పెట్టలేదని, అక్రమంగా రాజకీయ పార్టీ నాయకులను అరెస్టు చేయలేదని అన్నారు.