దూసుకెళ్తున్న హైదరాబాద్ బ్రాండ్
పదేండ్లలో పదింతలు పెరిగిన రియల్ వాల్యూ.. రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని వృద్ధి నమోదు
క్లిష్ట పరిస్థితులను అధిగమించి ఇతర మెట్రో నగరాలతో పోటీ
ఒక్క దశాబ్దంలోనే అద్వితీయమైన మార్పు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవిర్భవిస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా చీకట్లు అలుముకుంటాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. పెట్టుబడులు తరలిపోతాయి. ఉపాధి దొరకదు. మొత్తంగా రాష్ట్రం ఆగమైతుంది అని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న రోజులలో సీమాంధ్ర నాయకులు, మీడియా సంస్థలు చేసిన ప్రచారం ఇది. కానీ వారిది తప్పుడు ప్రచారమని కేవలం పదేళ్లలోనే తేలిపోయింది. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరంపై సీమాంధ్ర పాలకులు చేసిన కుట్రలను చెరుపుకుంటూ సాగిన పదేండ్ల స్వపరిపాలనలో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పదింతలు పెరిగింది. నిరంతర విద్యుత్ సరఫరా, అంతర్జాతీయ స్థాయి శాంతి భద్రతలతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ విధానాల కారణంగా పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ మారిందనేది నర్మగర్భం. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ కావడంతో పాటే పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగం గడిచిన పదేండ్లలో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పదింతలు అదనపు వృద్ధిని నమోదు చేసుకుందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నేడు దేశంలోని ఇతర మెట్రో నగరాలను తలదన్నే రీతిలో రియల్ వృద్ధిలో హైదరాబాద్ రియల్ రారాజుగా వెలుగుతోంది.
పదేండ్లలో ఊహించని మార్పు..
పరాయి పాలకుల సంకెళ్లను తెంచుకొని 2014 జూన్ 2వ తేదీ నుంచి 2024 జూన్ 2 వరకు దేశంలోనే ది బెస్ట్ లీవబుల్ సిటీగా కీర్తి గడిస్తున్న హైదరాబాద్ రియల్టీ రంగం ఔటర్ రింగు రోడ్డు దాటి రీజనల్ రింగు రోడ్డు వైపు పరుగులు పెడుతోంది. హైదరాబాద్‌లో కొన్నేళ్ల కింది వరకు బాబుఖాన్ ఎస్టేట్ ఎత్తున భవనంగా ప్రచారంలో ఉండేది. కానీ నేడు హైదరాబాద్‌లో 60 అంతస్థుల ఎత్తులోనూ భవంతులు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యునిటీలు, విల్లాలు విస్తరిస్తున్నాయి. గతంలో సైబరాబాద్ కేంద్రంగా మాత్రమే అభివృద్ధి జరిగేది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ నలు దిక్కులా ఐటీ పరిశ్రమలు విస్తరించడంతో భూముల ధరలు భారీగా పెరగడంతో పాటు హైరేజ్ భవంతుల నిర్మాణాలు ఊపందుకున్నాయి. బయ్యర్ల డిమాండ్‌ను బట్టి అనేక నిర్మాణ సంస్థలు రెరా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతులతో 60 అంతస్థులతో అనుమతులు పొందుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలతో పాటు ఔటర్ రింగు రోడ్డు వెంబడి 50 అంతస్థుల వరకు అనేక భవనాల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్‌తో పాటు అనేక మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఆఫీస్ కార్యాలయాల స్పేస్‌కు భారీగా డిమాండ్ ఉందని రియల్టర్లు పేర్కొంటున్నారు. దీంతో నగరంలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ
నరగంలో గతంలో తక్కువ పెట్టుబడి పెట్టిన నిర్మాణ సంస్థలు ప్రస్తుతం ధరలు పెరగడంతో వారి పెట్టుబడులకు మూడు రెట్లు అదనపు ఆదాయం సమకూరుతోంది. 2014 కంటే ముందు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టిన రియల్టర్లకు సుమారు 250 శాతం అధిక రాబడి వచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో హైదరాబాద్ రియల్టీ వైపు అందరి దృష్టి మళ్లింది. అలాగే గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలలో వార్షిక వృద్ధి 10 శాతం, వాణిజ్య నిర్మాణాలలో 15 నుంచి 20 శాతం వృద్ధి ఉందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వం ఔటర్‌తో పాటు నగరంలో మెరుగైన ప్రజా రవాణా కోసం మెట్రో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం, ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు అన్ని ప్రధాన కూడళ్లలో అండర్‌పాస్ నిర్మాణాలతో పాటు అనేక ఫ్లుఓవర్ల నిర్మాణం చేపట్టడంతో స్థిరాస్తి పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
మోసాలు కూడా ఎక్కువే..
హైదరాబాద్ రియల్, నిర్మాణ రంగం గడిచిన పదేండ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకోవడంతో పాటు మోసాలకూ అడ్డాగా మారిందని చెప్పవచ్చు. బయ్యర్ల డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని ఫ్రీలాంచ్‌ల పేరుతో ప్రజల నుంచి పెట్టుబడులు తీసుకుంటున్న రియల్, నిర్మాణ రంగం వ్యాపారులు పలు సందర్భాలలో మోసాలు చేస్తున్నారు. ఆకర్షనీయమైన ప్రకటనలు ఇస్తూ పెట్టుబడులు స్వీకరించిన అనంతరం బోర్డు తిప్పేస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత కూడా ప్లాట్లను కేటాయించకుండా ముఖం చాటేస్తున్న సంఘటనలు కోకొళ్లలు. అయితే ఇలాంటి మోసాలను నియంత్రించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెరా రూపంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కానీ రెరా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రియల్ మోసాలు ఎక్కువ జరుగుతుండటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రియల్ మోసాలను రెరా పూర్తి స్థాయిలో నియంత్రించడం లేదనే అపవాదు ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ మోసాలను కట్టడి చేస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం మరింత పురోగతిని నమోదు చేసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
విలాసవంతమైన భవనాలవైపు బయ్యర్ల చూపు
నగరంలో అపార్ట్‌మెంట్లతో పాటు గేటెడ్ కమ్యునిటీలు విస్తరిస్తున్నాయి. నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న బయ్యర్ల డిమాండ్‌ను బట్టి సకల వసతులు ఉన్న భవంతులను కొనేందుకు మొగ్గు చూపడంతో విలాసవంతమైన ప్రాజెక్టుల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కేపీహెచ్‌బీ, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, ఎల్‌బీనగర్, శంషాబాద్, పటాన్‌చెరు ప్రాంతాల్లో విలాసవంతమైన నిర్మాణాలు పెరుగుతున్నాయి. నిర్మాణ సంస్థలు కూడా బయ్యర్ల డిమాండ్‌కు తగినట్లుగా విలాసవంతమైన భవనాలను ఎక్కువ నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఒక ఫ్లోర్‌కు నాలుగైదు ప్లాట్ల నిర్మాణం చేసే సంస్థలు ప్రస్తుతం ఒక ఫ్లోర్‌లో ఒకే ఫ్లాట్‌ను 5 వేల నుంచి 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేస్తున్నారు. అయితే నగరంలో భూముల విలువలు పెరగడం, నిర్మాణ వ్యయం పెరగడంతో ఫ్లాట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. 2014లో 15 నుంచి 20 లక్షల లోపు లభ్యమైన ఫ్లాట్ల ధరలు ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరింది. దీంతో పేద, మద్య తరగతి ప్రజలకు సొంతింటి కల అందని ద్రాక్షగా మారుతోంది.
ఇతర నగరాలతో పోటీ..
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో హైదరాబాద్ నగరం బెంగుళూరు నగరంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం జీసీసీలలో బెంగుళూరు ప్రథమ స్థానంలో ఉండగా, ద్వితీయ స్థానంలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఏ గ్రేడ్ భవనాలు నిర్మిస్తున్నారని, దీంతో జేసీసీల వృద్ధి నమోదు అవుతోందని, భవిష్యత్తులో నగరం ప్రథమ స్థానానికి చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన త్రైమాసికంలో బెంగుళూరులో 60 శాతం, హైదరాబాద్‌లో 26 శాతం, ఢిల్లీలో 9 శాతం, ముంబైలో 4 శాతం, పుణేలో 1 శాతం లీజింగ్ వాటా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థలు పేర్కొంటున్నాయి. దేశంలోని కార్యాలయ భవనాల లీజింగ్ జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో జీసీసీల వాటా 29 శాతం ఉండగా, విస్తీర్ణం పరంగా చూస్తే 4.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.
- బూడిద సుధాకర్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి






