02-11-2025 01:09:22 AM
14% శాతం ప్రమాదం తగ్గినట్లు గుర్తింపు
మాత్రకు యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం
న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రపంచ వైద్యరంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. టైప్ 2 డయాబెటిస్ బాధితులకు గుండెపోటు, కార్డియక్ అరెస్ట్ ముప్పు తప్పించేందు కు అమెరికన్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ‘రైబెల్సస్’ అనేమాత్రకు ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మాత్ర మనిషి దేహంలోని రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించి, గుండెపోటు ముప్పును తప్పిస్తుందని ఎఫ్‌డీఏ పేర్కొంది.
‘సోల్ ట్రయల్’ శీర్షికన ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైన కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు, ఔషధ నిపుణుల బృం దం నాలుగేళ్ల నుంచి టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతూ, గుండె సంబంధిత రుగ్మతలు ఎదుర్కొంటున్న 9,650 మందిపై అధ్య యనం చేసింది. వీరికి ‘రైబల్సస్’ మాత్రలు ఇచ్చి ట్రయల్స్ వేయగా, వారిలో 14 శాతం గుండెపోటు, కార్డియక్ అరెస్ట్ ప్రమాదం తప్పినట్లు బృందం గుర్తించింది.
ట్రయల్స్‌పై యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్, ‘సోల్’ స్టీరింగ్ కమిటీ సహ-చైర్మన్ డాక్టర్ జాన్ బీ బ్యూస్ మాట్లాడుతూ.. ‘రైబెల్సస్’ మాత్ర వినియోగించిన టైప్ బాధితులకు గుండె పోటు, కార్డియక్ అరెస్ట్ ముప్పు తప్పుతుంద ని వివరించారు. బాధితులు అతితక్కువ సైడ్ ఎఫెక్ట్‌లతో సులభంగా అనారోగ్య సమస్యలతో బయటపడొచ్చని స్పష్టం చేశారు.