02-11-2025 01:06:25 AM
పాట్నా, నవంబర్ 1: ‘అసెంబ్లీ ఎన్నికల్లో మా జన సురాజ్ పార్టీ ఏకంగా 150 సీట్లు సాధిస్తుంది. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే ఆ సంఖ్య పదికి మాత్రమే పరిమితం’ అని ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండింట్లో ఏదో ఒక్కటి మాత్రమే జరుగుతుందని తాను భావిస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. తమ పార్టీ మరే ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. 160- సీట్లలో తమ పార్టీ గట్టిపోటీ ఇస్తుందని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ఒకవేళ హంగ్ ఏర్పడి తాము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తే.. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారవచ్చని పేర్కొన్నారు. వారిని తాను ఆపలేనని, డబ్బు ప్రలోభం, కేసుల భయాలే అందుకు కారణం కావొచ్చని కూడా వ్యాఖ్యానించారు.
బీహార్ రాజధాని పాట్నా నగరం లో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆర్జేడీ, జేడీయూకు ప్రత్యామ్నాయంగా బీహార్ ప్రజలు ఇప్పుడు తమ పార్టీ వంక చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. మూడింట ఒక వంతు మంది ఈ రెండు కూటములకు ఓటు వేయాలని అనుకోవడం లేదని వెల్లడించారు.