గాయాల పునాదులపై నేపాల్ పునర్నిర్మాణం
ఒకవైపు వేళ్లూనుకుపోయిన అవినీతి, రాజకీయ నాయకుల ఆడంబర జీవనం, విదేశాల్లో షికార్లు, ఉన్నత వర్గాల చేతుల్లోనే బందీ అయిన అధికారం, బంధుప్రీతి.. మరోవైపు నిరుద్యోగం, చేసేందుకు సత్తువ ఉన్నా చేయడానికి పనిలేని దుస్థితి, పూట గడుపుకొనేందుకు పొట్టచేతబట్టుకొని దేశదేశాలకు తిరగాల్సిన పరిస్థితి.. వెరసి తమ దేశంలోని పరిస్థితులను చూసి నేపాల్ యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
యువత నిరాశ, నిస్పృహల నుంచి నిప్పు రాజుకుంది. హిమాలయ దేశం రణరంగంగా మారింది. దశాబ్దాలుగా అధికార పీఠంపై పాతుకుపోయిన సంప్రదాయవాదులను పునాదులతో సహా పెకిలించారు నేపాల్ యువత. ఇది నాటి మాట. మరి నేడు, విధ్వంసపు పునాదుల మీద కొత్త ఆశల విత్తులను మొలకెత్తిస్తున్నారు యువతరం. కొత్తగా ఎన్నికైన యువ నేతల సారథ్యంలో నేపాల్ మార్పు దిశగా అడుగులు వేస్తున్నది.
నేపాల్‌లో గతేడాది జరిగిన జెన్ జీ తిరుగుబాటులో ఆ దేశ యువతకు శారీరక గాయాలే కాదు, ఆ దేశానికి మానసికంగా గాయాలయ్యాయి. శారీరక గాయాలు మానినప్పటికీ, మానసికంగా తగిలిన గాయాలింకా పచ్చిగానే ఉన్నాయి. ‘ఆ గాయాల పునాదులపైనే దేశాన్ని పునర్నిర్మిస్తాం, ఆ గాయాలను భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అద్భుతమైన మార్పు గా మలుస్తాం’ అని నాడు జెన్‌జీ ఉద్యమం లో కీలకపాత్ర పోషించిన బబ్లూగుప్తా ఆశాభా వం వ్యక్తం చేశారు. ఉద్యమం అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో గుప్తా మంత్రిగా సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన అతిపిన్న వయస్కుడైన క్యాబినెట్ సభ్యుడిగా గుర్తింపు పొందడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా అవినీతి, బాధ్యతారాహిత్యం, అధికార పీఠాన్ని పట్టుకొని వేలాడు తున్న పాత తరం రాజకీయ వర్గాలపై పెరుగుతున్న అసంతప్తి తదితర కారణాల నేపథ్యంలో యువత అసంతృప్తిగా ఉన్న సమయంలో నేపాల్‌లో జెన్‌జీ ఉద్యమం పురుడుపోసుకుం ది. ఈ ఉద్యమం ప్రపంచానికి ఒక మార్గదర్శంగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని ఇండోనేషియా, పెరూ, టోగో దేశాల్లో నిరసనలు చెలరేగాయి.
మొరా కో, కెన్యా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో యువత పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించింది. ఈ నిరసనలను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో ప్రపంచవ్యాప్తంగా యువత సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. నేపాల్‌లో నాయకత్వ మార్పు జరిగిన కొన్ని వారాలకే మడగాస్కర్‌లోనూ ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. యువత ఉద్యమం మూలంగా ఆ దేశ అధ్యక్షుడు దేశం విడిచివెళ్లేల్సి వచ్చింది.
అయితే, వాస్తవ పరిస్థితులను ఆ తర్వాతి నెలలు కండ్లకు కట్టినట్టు స్పష్టం చేశాయి. బంగ్లాదేశ్‌లో 2024లో యువత పెద్ద ఎత్తున చేసిన ఉద్యమం విజయవంతమైనప్పటికీ, ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ఓటర్లు సంప్రదాయ పార్టీకే మద్దతిచ్చారు. మడగాస్కర్‌లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో తాత్కా లిక ప్రభుత్వాన్ని సైనిక నాయకుడు రద్దు చేశా రు. దీంతో నిరసనలు చాలా తగ్గిపోయాయి.
అంతకుముందు మావోయిస్టు తిరుగుబాటును, 18 సంవత్సరాల క్రితం రాచరికాన్ని రద్దుచేసిన నేపాల్ మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఓటర్లు కూడా యువ నాయకత్వానికే మద్దతిచ్చి తమ ప్రత్యేకతను చాటుకున్నది. కాఠ్మాం డ్ మాజీ మేయర్ అయిన 35 ఏళ్ల బాలేంద్ర షా ఈ ఏడాది మార్చి 27న నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడి ప్పుడే పురుడుపోసుకుంటున్న యువతరం ఉద్యమాలకు ప్రతీకగా నిలిచారు.
నూతన ప్రభుత్వం కొలువైన వెంటనే నిరసనకారుల మరణాలపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘ఇప్పటి నుంచి దేశం సరికొత్త దిశలో ముందుకు సాగుతుంది’ అని జెన్‌జీ ఉద్యమాన్ని ముందుండి నడిపిన సామాజిక కార్య కర్త, ప్రస్తుత హోంమంత్రి సుదన్‌గురుంగ్ సోషల్ మీడియాలో పేర్కొంటూ యువతరంలో సరికొత్త ఆశలను చిగురించారు.






