నిప్పుల కుంపటిలా ఇందూరు!
ఉమ్మడి జిల్లాలో రికార్డు ఉష్ణోగ్రతలు
ఉదయం 9 గంటలకే నిర్మానుష్యంగా రోడ్లు
ఎండకు అల్లాడుతున్న ప్రజలు
బోధన్: మే 14 (విజయక్రాంతి): ఎండలు మండుతున్నాయి. నిప్పుల కొంపటిలా భానుడు భగభగ మండుతున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో నమోద వుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం 10 గంటల నుంచే సూర్యుని ఉగ్ర తాపానికి ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు ప్రజలు రోడ్లపైకి రాని పరిస్థితి నెలకొంది.
బోధన్ నిజయోకవర్గంలోని అన్ని మండలాల్లోని ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల్లో 44 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో బోధన్ మండలం సాలూర లో పరిధిలోనే ఉండడం గమనార్హం. సాలూరు గ్రామంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా బోదన్ మండలం 43.9 డిగ్రీలు, రేంజల్ 43.08 డిగ్రీలు, నవిపేట్ మండలంలో గ్రామాలలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జనం రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు.
నిప్పుల కుంపటి
జిల్లా లో గత రెండు రోజులుగా నిప్పుల కుంపటిలా మారింది. భానుడు భగభగ మండుతున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదు అవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బోధన్ లో ఇప్పటికే 43 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటే రోడ్లపైకి రావడానికి జనం జంకుతున్నారు. పగటి వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు..
గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా గురువారం 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేసుకోగా, గాలి లో తేమశాతం తగ్గిపోతోంది. దీంతో ఉక్కపోత పెరిగిపోయింది. సాయంత్రం వడ గాలులు ఎక్కువగా వీచాయి. గాలి దుమారం పెరిగింది. గత మూడు రోజులుగా భూమి సెగలు కక్కుతోంది. వేడి గాలులు దడ పుట్టిస్తున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.
వడదెబ్బతో జాగ్రత్త..
ఎండల ప్రభావంతో ప్రతీ ఏడాది వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్హిట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చమట ఎక్కువగా రావడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లవచ్చు. శరీరంలో ప్రొటిన్స్థాయి తగ్గిపోయి అవయవాల పనితీరుపై ప్రభావడం చూపుతాయి. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ సాధారణ స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు పేర్కొంటున్నారు.






