calender_icon.png 4 February, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో రిక్రూట్‌మెంట్ జీరో

04-02-2026 02:19:58 AM

  1. రెండేళ్లయినా అందని 2 లక్షల ఉద్యోగాలు
  2. ఉద్యోగాల భర్తీపై సీఎం ముఖం చాటేయడం సిగ్గుచేటు
  3. కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్‌కు పాతర
  4. ఆరు గ్యారెంటీలు అక్షరాలా గారడీలే..
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణలో రిక్రూట్‌మెంట్ జీరో.. రెండు లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే అని ఇచ్చిన గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.  అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోందని కేటీఆర్ తెలిపారు.

తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గాంధీ మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫొటోలకు ఫోజులు కొట్టిన సీఎం, ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో “రిక్రూట్మెంట్ జీరో”గా మారిపోయిందని కాంగ్రెస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎండగట్టారు.

పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్‌కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని, రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది పొరపాటే అని హెచ్చరించారు.

తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కున వేలేసుకుని క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదని, నిరుద్యోగులకు, విద్యార్థులకు చేస్తున్న ఈ ద్రోహంపై తాము కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడుతామన్నారు. మేధావుల ముసుగు వేసుకుని మాయమాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేళ్ల నుంచి మూగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికే పోదని, నిరుద్యోగులకు, యువతకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు.

అన్ని వర్గాలను మోసగించిన సర్కార్

కేవలం నిరుద్యోగులను మాత్రమే కాకుండా రాష్ర్టంలోని అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారని తెలిపారు. సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారని కేటీఆర్ తెలిపారు.

ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయమఅన్నారు. మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తామని కేటీఆర్ తెలిపారు.