3 July, 2026 | 10:55 AM

ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు

12-06-2024 01:25 AM

ఫోన్‌ట్యాపింగ్ కేసు  

న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్‌కుమార్‌కు కూడా

నాంపల్లికోర్టులో ఛార్జిషీట్

భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్‌లపై ముగిసిన వాదనలు  

నేడు తీర్పు వెల్లడించనున్న కోర్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి) : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు మందకొడిగా సాగిన విచారణలో ప్రస్తుతం అధికారులు దూకుడు పెంచారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటివరకు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం వీరు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ న్యూస్ ఛానల్ అధిపతికి మంగళవారం రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వీరిద్దరిని రప్పించి విచారిస్తే ఫోన్‌ట్యాపింగ్ వెనక ఎవరున్నారనే విషయంపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందం అధికారులు భావిస్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసు ఛార్జిషీట్‌లో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు.

మరోవైపు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్ట్ చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో తీర్పు బుధవారం వెల్లడించనున్నట్లు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.

అయితే ఈ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారమే పోలీసులతో బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రివ్యూ నిర్వహించారు. సీఎం అధికారులతో భేటీ అయిన మరుసటి రోజే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ప్రస్తుతం అమెరికాలో  ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ నెల 16న కేసు విచారణకు హాజవుతారని సమాచారం. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులు, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చెప్పడంతో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు

ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్‌కుమార్‌లను విదేశాల నుంచి తీసుకువచ్చేందుకు దర్యాప్తు అధికారులు ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సీఐడీ విభాగం ద్వారా సీబీఐకి పంపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటర్‌పోల్, అక్కడి నుంచి విదేశాల్లో ఉన్న వారికి చేరి, వారి అరెస్ట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పోలీసులు ఫోన్‌ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్ కుమార్‌లపై మంగళవారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ రెడ్ కార్నర్ నోటీసు జారీ కోసం తప్పనిసరిగా చార్జిషీట్ దాఖలు చేయాల్సిన నిబంధన ఉండడంతో హైదరాబాద్ పోలీసులు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుకు సంబంధించిన అంశాలతో కూడిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. కోర్టు చార్జిషీట్‌ను పరిశీలించి నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్‌కు సీసీ (కేసు క్యాలెండర్) వచ్చిన తర్వాత కోర్టులో విచారణ వేగవంతంగా జరగనుందని తెలుస్తోంది.