తప్పుడు అఫిడవిట్లు ఇవ్వొద్దు
బరాజ్‌లు బాగుంటే ప్రజలకే మేలు
తప్పు ఎక్కడ జరిగిందో విచారిస్తున్నాం
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్
అలా చేస్తే చట్ట ప్రకారం చర్యలు
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగం పెంచింది. ఇప్పటికే పదుల సంఖ్యలో అధికారులు, ఇంజినీర్లకు నోటీసులు ఇచ్చి సమాచారాన్ని రాబట్టిన కమిషన్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. విచారణలో వెల్లడించిన అంశా లపై అఫిడవిట్‌లు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.
ఈ నెల 15వ తేదీ లోగా సమాధానాలు, వివరణలను అఫిడవిట్ల రూపంలో కమిషన్‌కు అందిం చాలని స్పష్టం చేసింది. వివరణ ఇచ్చినవారి నుంచి అఫిడవిట్ రూపంలో స్టేట్‌మెంట్ తీసుకుంటున్నామని, అధికారులు ఎవరైనా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినా.. కమిషన్‌ను తప్పుదోవ పట్టించాలని చూసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మంగళవారం బీఆర్‌కే భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు.
ఒక్క రోజు పనిచేసినా పిలుస్తాం
కమిషన్‌ను తప్పు దోవ పట్టించాలని చూసినా.. తప్పుడు అఫిడవిట్‌లు దాఖలు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జస్టిస్ ఘోష్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబం ధించి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు చాలా సమాచారం వచ్చిందని, ఈ ప్రాజెక్టులో ఒక్కరోజు పనిచేసినా.. వారిని పిలిచి విచారణ చేస్తామని చెప్పారు. సోమవారం రిటైర్డ్ ఈఎన్‌సీతో సహా పలువురు ఉన్నతాధికారులను విచారించిన కమిషన్.. మంగళవారం మరో 20 మందితో సమావేశమై సమాచారాన్ని సేకరించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొన్నది. వీరందరూ జూన్ 25వ తేదీలోపు విచారణలో పేర్కొన్న అంశాలను తెలుపుతూ.. అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించినట్టు తెలిపారు.
త్వరలో నిర్మాణ సంస్థల విచారణ
గత రెండు రోజులు ఇంజినీర్లతో జస్టిస్ జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. ఇక బుధవారం నుంచి ఏం చేయాలనేది ఒక జాబితాను రూపొందించనున్నట్టు కమిషన్ మీడియాకు తెలిపింది. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను విచారణకు పిలుస్తామని కమిషన్ తెలిపింది. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో అధికారుల పేర్లు ఉంటే వారికి కూడా నోటీసులు ఇస్తామని స్పష్టంచేశారు.
బరాజ్‌లు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం కలుగుతుందని జస్టిస్ ఘోష్ అన్నారు. ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగి ఉంటుందనిని పేర్కొన్నారు. బరాజ్‌ల వల్ల లాభం తప్ప నష్టం లేదని అభిప్రాయపడ్డారు. మూడు బరాజ్‌లల్లో పనిచేసిన ఇంజినీర్లను పిలిచి విచారిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు.






