3 July, 2026 | 11:59 AM

కోతఖానలో మేతగాండ్లు!

12-06-2024 01:22 AM

శవాల మీద పేలాలు ఏరు కోవడం అంటే ఇదేనేమో! ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో శవాలతో బేరసారాలు సాగిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ చేయాలంటే చేతులు తడపాల్సిన దుస్థితికి దిగజారింది. అక్కడ పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి మానవత్వం, కనికరం కరువై శవాలమాటున డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. అందుకు తగినట్లుగానే మీ పని కావాలంటే డబ్బులు ఇచ్చుకోవాల్సిందేననే డిమాండ్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. మనిషి చనిపోయిన పుట్టెడు దుఃఖంలో బాధితులు ఉంటే శవాలపై పైసలు ఏరుకున్న చందంగా అక్కడి సిబ్బందికి వారు అడిగిన సొమ్ము ముట్టజెప్పాలి. లేదంటే అంతే సంగతులు. ఇది కొంతకాలంగా ఎంజీఎం మార్చురీలో కొనసాగుతున్న వ్యవహారం. 

వరంగల్ ఎంజీఎంలో చావుబేరం

పైసలిస్తేనే పోస్ట్‌మార్టం 

మృతదేహానికి రూ.5 వేలు

శవాలతో సిబ్బంది బేరం 

ఫోరెన్సిక్ వైద్యుల దందా!

మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు 

 కంపుకొడుతున్న పరిసరాలు

హనుమకొండ, జూన్ 1౧ (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పెద్ద దిక్కుగా ఉంది. ప్రతిరోజు వివిధ జబ్బులు నయం చేసుకోవడం కోసం పేద, మధ్య తరగతి రోగులు ఇక్కడికి వేలాదిగా వస్తుంటారు. దీనికితోడు  హత్యలు, ఆత్మహత్యలు, వివిధ ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలు రోజుకు పదుల సంఖ్యలో మార్చురీకి వస్తుంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మృతదేహాలకు ఉచితంగా పోస్ట్‌మార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది.

ఉదయం 10 గంటలకు మార్చురీకి రావాల్సిన డాక్టర్ సమయానికి రాడు. ఇక్కడి సిబ్బంది పిలిస్తే గానీ రాని దయనీయ పరిస్థితి. సిబ్బంది డాక్టర్‌ను పిలవాలంటే మృతదేహం సంబంధీకులు వారు అడిగిన సొమ్ము ముట్టజెప్పాలి. లేదంటే డాక్టర్ రాడు. ఎవరు పైసలిస్తే వారి పని తొందరగా అయిపోతుంది. పంచనామా దగ్గర నుంచి మొదలుకుని మృతదేహాన్ని బయటకు పంపే వరకు పనికో రేటును బట్టి రుసుము చెల్లించాల్సిందే. ఒక్క పైసా తగ్గినా మృతదేహం మార్చురీలోనే కుళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొందనే ఘటనలు అనేకం ఉన్నాయి. 

పనికో రేటు..!

ఎంజీఎం మార్చురీలో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అనే ప్రచారం జరుగుతోంది. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయాలంటే సంబంధిత ఫోరెన్సిక్ డాక్టర్‌కు మొదట రూ. 2 వేలు ముట్టజెప్పాలట. ఆ తర్వాత గానీ ఆయన మార్చురీకి వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించే సిబ్బందికి వెయ్యి రూపాయలు ఇచ్చుకోవాలి. అప్పుడు గానీ వారు పని మొదలు పెట్టరట. పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని ప్యాక్ చేసేందుకు చాప, తెల్లటి వస్త్రం, రెండు సెంటు బాటిళ్లు (వాసన రాకుండా ఉండేందుకు ) సంబంధీకులే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అందుకు మార్చురీకి ఎదురుగా ఉన్న షాపుల్లో రూ. 2 వేలు చెల్లిస్తే ఇస్తారు. ఈ షాపులు కూడా మార్చురీ సిబ్బంది కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు సమాచారం. ఇందులో వారి వాటా వారికి అప్పజెప్పాల్సిందే. ఈ క్రమంలో ఒక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాలంటే బాధితులు రూ. 5 వేలు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై గతంలో అనేక ఆందోళనలు జరిగాయి. ఆరేళ్ల కిందట పోస్ట్‌మార్టం కోసం రూ. 3 వేలు లంచం డిమాండ్ చేసిన ఫోరెన్సిక్ వైద్యుడు రజామాలిక్‌ను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మరో ఇద్దరు సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

పనిచేయని ఫ్రీజర్లు?

ఎంజీఎం మార్చురీలో శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు పనిచేయడం లేదని తెలుస్తోంది. మార్చూరీలో మొత్తంగా ఐదు ఫ్రీజర్లు ( ఒక్కొ దానిలో మూడు బాక్స్‌లు ఉంటాయి) ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. దీంతో గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరిచిన క్రమంలో పరిసరాలు కంపు కొడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టం కోసం అక్కడికి వచ్చే వాళ్లు రెండు నిమిషాలు కూడ నిలబడలేని పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. వేసవి కాలం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎంజీఎం ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండటం లేదని స్థానికులు వాపోతున్నారు. 

వాసన భరించలేకుండా ఉంది

మనిషిని పోగొట్టుకొని పుట్టెడు దుఖంతో ఉన్న వాళ్ళకి మార్చురీ వద్ద కనీస సౌకర్యాలు లేవు. తాగడానికి నీళ్లు లేవు. మార్చురీ గది వద్దకు వెళ్లాలంటే సాహసం చేయాల్సిన పరిస్థితి. శవాలను భద్రపరిచే విషయంలో వైద్యాధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఫ్రీజింగ్ సరిగాలేక శవాల నుంచి భరించలేని వాసన వస్తుంది. ముక్కులు పగిలిపోతున్నాయి. ఈ విషయంపై వైద్యాధికారులు దృష్టిసారించాలి. 

 వేల్పుగొండ యాకయ్య, చింతల్, వరంగల్

పైసలతోనే పని నడుస్తోంది

ప్రాణాలు లేని శవాలను అడ్డం పెట్టుకొని అక్రమంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. నగదు చేతిలో పడనిదే మార్చురీ వద్ద ఏ పని జరగడం లేదు. మనిషి ప్రాణాలు పోయి కుటుంబం మొత్తం దుఃఖంలో ఉంటే వాళ్లకి అదేమీ పట్టదు. వేలకు వేలు తీసుకొని శవాలను మూట కట్టి ఇస్తున్నారు. శవాలమీద పైసలు ఏరుకుంటున్నారు. 

 ఆకుల రాము, 

మడికొండ, హనుమకొండ