ఇందిరమ్మ ఇళ్లకు ధరలు తగ్గించండి
- స్టీల్, సిమెంట్ సంస్థలు సామాజిక బాధ్యత వహించాలి
- మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- సానుకూలంగా స్పందించిన పరిశ్రమలు
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్టీల్, సిమెంట్ ధరలను పరిశ్రమల సంస్థలు తగ్గించాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. సామాజిక బాధ్యతతో ఇళ్ల నిర్మాణంలో భాగస్వామలు కావడానికి ముందుకు రావాలి కోరారు.
గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా, పరిశ్రమల సహకారం అంశాలపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాద్ మినహా) మొదటి విడతలో పేదలకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
వీటిలో ఇప్పటికే గణనీయ సంఖ్యలో 85 శాతం ఇళ్ల శ్లాబులు పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటిలో నివసించే వరకు ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ బృహత్తరమైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్టీల్, సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం కలిసి పనిచేస్తే తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రం లక్ష్యాన్ని త్వరితగతిన సాధించవచ్చని తెలిపారు. పరిశ్రమలు, హౌసింగ్ అధికారులు ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారునికి ఏవిధంగా మెటీరియల్ చేరవేయాలన్న దానిపై రూట్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. మంత్రుల విజ్ఞప్తికి పరిశ్రమల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. సమావేశంలో రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.






