calender_icon.png 23 February, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలి

23-02-2026 01:05:51 AM

  1. గళమెత్తిన వక్ఫ్ బోర్డు బాధితులు
  2. బోడుప్పల్‌లో భారీ ర్యాలీ, ధర్నా

మేడిపల్లి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): వక్ఫ్ బోర్డు భూమి పేరుతో నిలిపివేసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని వక్ఫ్ బోర్డు బాధితులు ఆదివారం భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. బోడుప్పల్‌లో దాదాపు 300 ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డు కిందికి వస్తుందని, ఇందులో క్రయవిక్రయాలు చేయడానికి వీలు లేదని, ఇక్కడ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కొంతమంది సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. ఫలితంగా 2018 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేశారు.

దీంతో ఇక్కడ ప్లాట్లు కొన్న యజమానులు దాదాపు 10,000 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లక్షలు వెచ్చించి ప్లాట్లు కొన్నామని, ఎంతో కష్టపడి ఇండ్లు నిర్మించుకున్నామని వాపోతున్నారు. 2018కి ముందు లేని వక్ఫ్ బోర్డు పరిధి ఆ తర్వాత ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సమస్యను పరిష్కరిస్తామని అన్ని పార్టీ నేతలు తొడకొట్టి మరీ చెప్పారని, ప్రభుత్వం మారి రెండేండ్లు గడిచినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వక్ఫ్ బాధితుల పక్షాన మేడ్చల్ నియోజకవర్గం నుంచి వందలాది నామినేషన్లు వేశామని, కానీ ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సమస్యను పరిష్కరిస్తామని, నామినేషన్లను విరమించుకోవాలని కోరడంతో వెన క్కి తగ్గామని గుర్తుచేశారు. స్థానిక కార్పొరేషన్ ఎన్నికల లోపు సమస్యను పరిష్కరిం చాలని బాధితులు డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో బాధితులమే కార్పొరేటర్లు పోటీలో ఉంటామని, మిగతా డివిజన్లలోని అభ్యర్థులను నిలిపి ప్రచారం చేస్తామని హెచ్చరిం చారు. తాము ఓట్లు వేయడానికి, పన్నులు, కరెంటు బిల్లులు కట్టడానికే పనికొస్తామా అని ప్రశ్నించారు. అవసరాలకు ప్లాట్లను, ఇండ్లను అమ్ముకోలేకపోతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పాలకులు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. బోడుప్పల్ ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాచేశారు.