షేక్ మగ్దూంపై పీడీ యాక్ట్ నమోదు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడిన షేక్ మగ్దూంపై పీడి యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పి డివి శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 31న ఆదివాసి మహిళపై హత్యయత్నం, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన మగ్దూంపై పీడి యాక్ట్ నమోదు కోసం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో అడ్వైజరీ బోర్డు సభ్యుల ఆమోదం మేరకు పీడీ యాక్ట్ అమలు చేశారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా పశువుల రవాణా, మట్కా, కోడి పందాలు, ఆన్లైన్ బెట్టింగ్, పేకాట, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రేషన్ బియ్యం అక్రమంగా తరలించడం, మతవిద్వేషాలను రెచ్చగొట్టి ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.






