6 May, 2026 | 3:51 PM

పశువుల అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్

06-05-2026 03:15 PM

- చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు

- గోరక్షణ పేరుతో హింసకు పాల్పడవద్దు 

- అడ్డుకునేందుకు చెక్ పోస్టుల ఏర్పాటు...

- సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల,(విజయక్రాంతి): పశువుల అక్రమ రవాణాపై ఎంత మాత్రం ఉపేక్షించేది (జీరో టాలరెన్స్) లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. బుధవారం సీపీ కార్యాలయంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ (వీహెచ్‌పీ యువజన విభాగం), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హిందూవాహిని, శ్రీరామ్ సేన, హిందూ యువవాహిని సభ్యులతో పశువుల అక్రమ రవాణా నిరోధంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో సీపీ మాట్లాడారు.

పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని, ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, వ్యక్తిగత దాడులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అక్రమంగా పశువులను తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

ఎనిమిది చెక్ పోస్టులు ఏర్పాటు...

రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎనిమిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఐదు (మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్-63 రోడ్డుపై గూడెం చెక్‌పోస్ట్ వద్ద, జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందన్‌పల్లి ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద, కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాపన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల సరిహద్దు ఇందారం చెక్‌పోస్ట్ వద్ద, తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేపల్లెవాడ చెక్‌పోస్ట్ వద్ద ) చెక్ పోస్టులు, పెద్దపల్లి జిల్లా పరిధిలో మూడు (బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసంత్‌నగర్ టోల్‌గేట్ చెక్‌పోస్ట్ వద్ద, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బపల్లి చెక్‌పోస్ట్ వద్ద, సుల్తానాబాద్, గుంపుల ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టు) చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాత్రింబవళ్లు ప్రత్యేక డ్రైవ్ లు...

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎనిమిది ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు వాహనాలను తనిఖీ చేస్తున్నామని సీపీ తెలిపారు. వీటితో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతున్నామన్నారు. పశువులను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇది మూగజీవాల పట్ల క్రూరత్వానికి దారితీస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పశువుల రవాణాకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, కౌ స్లాటర్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) చట్టాల కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయనున్నట్లు హెచ్చరించారు.

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు...

సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలు నిర్ధారించకుండా వాటిని పంచుకోవద్దని ప్రజలకు సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే రామగుండం పోలీస్ కంట్రోల్ రూమ్ (8712656597), డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సామాజిక సామరస్యాన్ని కాపాడేలా, మూగజీవాల రక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రావు,స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ భీమేష్, తాండూర్ సీఐ దేవయ్య, ఆర్‌ఐ పెద్దన్న, రమేష్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.