అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉండాలి
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై హన్వాడ మండలానికి చెందిన పలు గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినవారు దాచక్ పల్లి గ్రామ సర్పంచ్ వడ్డె శ్రీలత కృష్ణ, మాజీ సర్పంచ్ డి. బాలకిష్టా రెడ్డి, వార్డు సభ్యులు మ్యాతరి గోపాల్, మర్పలి చెన్నయ్య, పి. అనిల్ రాఘవేందర్, డి. శశికళతో పాటు వెంకటమ్మ కుంట తాండా సర్పంచ్ పి. వెంకట్ నాయక్, వేపూర్ గ్రామ డిప్యూటీ సర్పంచ్ శిలావంతు రమేష్, వార్డు సభ్యులు కడావత్ రాందాస్, పరుమటి శేఖర్, అమ్మనోళ్ళ వెంకట్ రామిరెడ్డి, పరుమటి శివ, తలారి శివ కుమార్, యారోనిపల్లి గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతూ ప్రయోజనం కలిగిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యతగా తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామాలకు అధిక నిధులు తీసుకురావడం, పంచాయతీలకు నేరుగా నిధులు అందించడం, రోడ్లు, పాఠశాలలు, మౌలిక వసతుల అభివృద్ధిపై తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. విద్యా రంగంలో తీసుకున్న చర్యల ఫలితంగా పదో తరగతి ఫలితాలు గణనీయంగా మెరుగయ్యాయని చెప్పారు. వైద్య సేవలు కూడా పేద ప్రజలకు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, క్యాంప్ ఆఫీస్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి తక్షణమే పరిష్కరిస్తున్నామని వివరించారు.
మధ్యవర్తుల అవసరం లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు క్యాంప్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని, దీనికోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ విధమైన ప్రజా పాలనకు ఆకర్షితులై సర్పంచులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.






