16 May, 2026 | 7:48 PM

క్రషర్ అనుమతులు రద్దు చేయాలని కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష

16-05-2026 07:15 PM

మేడ్చల్,(విజయక్రాంతి): రావలకోలు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులు రద్దు చేయాలని ఆ గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 111 సర్వే నంబర్ లో ప్రజాభిప్రాయానికి భిన్నంగా క్రషర్ ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. 2021 నవంబర్ నెలలో క్రషర్ ఏర్పాటు విషయమై ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, అప్పట్లో తాము వ్యతిరేకించామని తెలిపారు. కానీ 2026 ఫిబ్రవరిలో మైనింగ్ ఏడి అనుమతి ఇవ్వడం అక్రమమని వారు పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అనుమతి ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మునీరాబాద్ శివారులో ఒక క్రషర్ మూత పడిందని దానికి సంబంధించి రాయల్టీ 20 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. ఆ క్రషర్ యజమాని కుటుంబంలోని మరొకరి పేరు మీద రావలుకోలు గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వానికి రాయల్టీ బకాయి ఉన్నవారికి అనుమతి ఇవ్వద్దని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడి అనుమతి ఇచ్చారని వారు ఆరోపించారు.

క్రషర్ అనుమతి రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. అనుమతి రద్దు చేయాలని, అవినీతికి పాల్పడి అనుమతి ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందపురం నరేష్, మామిండ్ల వెంకటేష్, మామిండ్ల ఆనంద్, బంటు నర్సింగరావు, బంటు మల్లేష్, సుక్క శేఖర్, గడిల రమేష్, ఎర్రవల్లి హారత్ రెడ్డి, గున్నాల రాము గౌడ్, తెడ్డు రాజారామ్, మామిండ్ల గణేష్, ఎక్కడ దేవి శ్రీశైలం, గుమ్మడి బిక్షపతి,  సాయి శ్రావణ్, పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.