24 June, 2026 | 1:46 AM

క్రషర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు

24-06-2026 01:00 AM

అనుమతులు రద్దు చేసే వరకు ఆందోళన చేస్తామని స్పష్ఠీకరణ

 మేడ్చల్, జూన్ 23(విజయ క్రాంతి): ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్ కోల్ గ్రామం లో 111 సర్వే నెంబర్ లో  క్రషర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు.  క్రషర్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షకు దిగారు. క్రషర్ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇచ్చారని ఇక్కడికి ఎవరు రావద్దు అంటూ రైతులను వారి పొలాల వద్దకు వెళ్లనివ్వకుండా క్రషర్  నిర్వాహకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

క్రషర్ ఏర్పాటు వల్ల తమ సాగు భూములు దెబ్బతినడంతో పాటు  పర్యావరణ కాలుష్యం  పెరిగి జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రషర్ అనుమతులను రద్దు చేసే వరకు  ఆందోళనలను కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఏండ్ల కిందనే  వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం సర్వేనెంబర్ 111 లో  భూమి కేటాయించిందని  రైతులు తెలిపారు.

అప్పటినుండి  ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కొత్తగా ఇక్కడ క్రషర్ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చి తమ పొట్ట మీద కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా  క్రషర్  అనుమతులు రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని  తెలిపారు.