14 June, 2026 | 1:45 AM

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట

14-06-2026 12:00 AM
  1. స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన సిబ్బంది మళ్లీ విధుల్లోకి..
  2. మంత్రి సీతక్క చొరవ.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పునర్నియామక ప్రక్రియకు ప్రభుత్వం పచ్చా జెండా ఊపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది.

ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన అంగన్వాడీ సిబ్బందికి న్యాయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, ఎన్నికల్లో విజయం సాధించని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల అప్పీల్స్‌ను పరిశీలించనున్నారు.

అయితే వారి స్థానంలో ఇప్పటికే మరో అభ్యర్థిని నియమించని సందర్భాల్లో మాత్రమే పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శాఖ సెక్రటరి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనేక మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఊరట లభించనుంది.