రేపటి నుంచి విద్యార్థులకు అల్పాహారం
1269 సర్కారు బడులు, 33 ఇంటర్ కాలేజీల్లో అమలు
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం అల్పాహార (బ్రేక్ ఫాస్ట్) పథకాన్ని ప్రారంభించనుంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహార పథకాన్ని అమలు చేయనుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాలోని 1269 పాఠశాలలు, 33 ఇంటర్ కాలేజీల్లో సోమవారం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.
తొలుత కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మాత్రమే దీన్ని ప్రారంభించనున్నారు. తర్వాత విడతలవారీగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో దీన్ని అమలు చేయనున్నారు. తొలివిడతలో భాగంగా 1,44,610 మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. అల్పాహారంతోపాటు విద్యార్థులకు పాలు, రాగిజావ కూడా అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.






