12-08-2025 12:20:26 AM
ఎన్నికల కోడ్ ఉల్లఘించారంటూ నమోదైన కేసును కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం
హైదరాబాద్, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2019, అక్టోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పీఎస్‌లో రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును కొట్టేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టేయాలని సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ కే లక్ష్మణ్ కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా తనపై కమలాపూర్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. 2021లో హుజూర్‌నగర్‌లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. కొవిడ్ నిబంధనలు ఉల్లఘించి రేవంత్‌రెడ్డి సభ నిర్వహించినట్టు ఫిర్యాదు చేశారు.ఈ కేసులో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు ఎన్నికల అధికారికి కోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.
రేవంత్‌పై అట్రాసిటీ కేసు.. పిటిషనర్‌పై సుప్రీం మొట్టికాయలు
సీఎం రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటిషనర్ పెద్దిరాజుకు అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. రేవంత్‌రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును గతంలో తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టేసింది.
ఆ కేసును నాగ్‌పుర్ బెంచ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పెద్దిరాజు ట్రాన్స్‌ఫర్ పిటిషన్ వేశారు. అందులో హైకోర్టు న్యాయమూర్తిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పిటిషన్ డ్రాప్ట్ చేసిన ఏఓఆర్, పెద్దిరాజుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యకు క్షమాపణలు చెప్పాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గోపన్నపల్లి ప్రైవేట్ భూ వివాదం వ్యవహారంలో పెద్ది రాజు గతంలో సీఎం రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసును వెనక్కి తీసుకుంటానని పెద్ది రాజు అభ్యర్థించినప్పటికీ సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.