15 August, 2026 | 3:18 AM

కరూర్ బాధితులకు ఊరట

15-08-2026 02:14 AM

కొలువుల కేటాయింపుపై మద్రాసు హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

బాధితులకు అండగా నిలవడం తప్పా..? అంటూ పిటిషనర్‌కు మందలింపు

చెన్నై, ఆగస్టు 14: కరూర్ తొక్కిసలాట బాధితులకు ఉద్యోగాలకు సంబంధించిన కేసులో తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నియామకాలు చెల్లవంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం జస్టిస్ జేపీ పార్థివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి స్టే విధించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పిటిషన్ దారులకు నోటీసులు జారీ చేసింది. ఇంటిపెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరా ఇవ్వొద్దా? అని పిటిషన్ దారులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

తొక్కిసలాట జరిగి చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగం కల్పించడంపై ప్రశ్నించడం సమంజసమేనా? ప్రశ్నించేందుకు మీరు ఎవరు? అని పిటిషన్ దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్ తొక్కిసలాట సందర్భంగా 41 మంది మృతి చెందారు. జూలై 10న అధికారంలోకి వచ్చాక సీఎం విజయ్ అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, నియామకాలు చెల్లవని తీర్పునిచ్చింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.