21 May, 2026 | 7:53 PM

మత రాజకీయాలు మానుకోవాలి

21-04-2024 12:30 AM

l అభివృద్ధిని చూపి ఓట్లడగాలి

l బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదు

l మంత్రి పొన్నం ప్రభాకర్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): బీజేపీ మత రాజకీయాలు మానుకోవాలని, చేసిన అభివృద్ధిని చూపి ఓట్లడగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. శనివారం వేములవాడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇంతకుముందు ఎంపీలుగా ఉండి చేసిందేమీ లేదని విమర్శించా రు.

ఎన్నికలు వస్తేనే రైతులు, నేతన్నలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో బండి సంజయ్ ఎన్నిసార్లు ప్రజలను కలిశారో చెప్పాలని అన్నారు. ఆలయాల అభివృద్ధికి నిధులు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. జోగులాంబ ఆలయానికి నిధులు వచ్చాయని.. కానీ వేములవాడ, కొండగట్టు ఆలయాలకు నిధులు ఎందుకు రాలేదని అడిగారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏం చేయలేకపోయిందన్నారు.

కేసీఆర్ తన కుమార్తెను విడిపించుకునేందుకే మోదీ దగ్గర బేరాలకు దిగారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజన్న ఆలయం, చేనేత కార్మికులు, మధ్య మానేరు సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌లో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోండూరి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.