తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి
l డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు
l రాష్ట్రానికి క్యూ కడుతున్న కేంద్రమంత్రులు
l ఈనెల 25న అమిత్ షా రాక
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా కాషాయ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. అందుకే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అభ్యర్థుల నామినేషన్లు, ప్రచారాలకు సైతం కేంద్ర మంత్రులు క్యూ కడుతున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా అధినాయకత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి ఎంతో అనుకూల వాతావరణం ఉందని, ఇంతకంటే మంచి తరుణం మళ్లీ దొరకదని పార్టీ భావిస్తోంది.
సికింద్రాబాద్, ఖమ్మం ఎంపీ అభ్యర్థులు కిషన్ రెడ్డి, వినోద్ రావు నామినేషన్ల కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈటల నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి, మెదక్‌లో నిర్వహించిన రఘునందన్ ప్రచార సభకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. రేపటి నుంచి మరికొంత మంది కేంద్రమంత్రులు తెలంగాణకు వస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు హాజరైతే తమకు గెలుపు అవకాశాలు మరింతగా పెరుగుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు.
22న రాష్ట్రానికి కిరణ్ రిజిజు...
ఈ నెల 22న మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్ల కార్యక్రమానికి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. 22వ తేదీనే చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్‌లో బీబీ పాటిల్ నామినేషన్లకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వస్తున్నారు. ఈ నెల 23న భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నామినేషన్‌కు విదేశాంగ మంత్రి జయశంకర్ రానున్నారు. ఈనెల 25న రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.
మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ భన్సల్ రాష్ట్రంలో సాగుతున్న ప్రచార తీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీలోని వివిధ విభాగాల నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భువనగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఆదివారం జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో, రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ కమిటీలతో సోమవారం ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.






