12 August, 2026 | 8:49 PM

కలెక్టర్ ఆదేశంతో సమస్యకు పరిష్కారం

12-08-2026 07:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కదిలారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో జాతీయ రహదారి -44కు ఇరువైపులా ఉన్న డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించాలని గ్రామ సర్పంచ్ రాముతో పాటు గ్రామస్తులు ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా ఎవరు పట్టించుకోలేదు. హైదరాబాద్‌ - నాగ్‌పూర్ మధ్య జాతీయ రహదారి -44ను నాలుగు లైన్లుగా విస్తరించిన సమయంలో కడ్తాల్ గ్రామంలో రహదారికి ఇరువైపులా డ్రైనేజీలను నిర్మించారు. అయితే రహదారి విస్తరణ తర్వాత ఇప్పటివరకు డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఏళ్లుగా చెత్తాచెదారం  వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కున్నారు. 

దుర్గంధం, దోమల బెడదతో ప్రజలు అవస్థలు పడ్డా ఇటీవల గ్రామంలో నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం సర్పంచ్ గుర్రం రాము ఆధ్వర్యంలో గ్రామస్తులు జూలై 27న నిర్వహించిన ప్రజావాణిలో డ్రైనేజీ సమస్యను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన కలెక్టర్ వెంటనే స్పందించడంతో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సంబంధిత ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి డ్రైనేజీలను తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లా అధికారుల ఆదేశాలతో ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది రంగంలోకి దిగి డ్రైనేజీల్లోని పూడిక, చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యకు నూతన పాలకవర్గం చొరవతో పరిష్కారం లభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.