కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆకస్మిక తనిఖీ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని వసతులు, విద్యార్థులకు అందుతున్న భోజనం, విద్యా సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి మెనూ ప్రకారం భోజనం సక్రమంగా అందుతున్నదా? భోజనం నాణ్యత ఎలా ఉంది? చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా? వసతులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా?” అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు తమ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
- అభివృద్ధి పనులు పరిశీలన
అనంతరం విద్యాలయంలో రూ.42 లక్షలు, రూ.53 లక్షల వ్యయంతో చేపడుతున్న డార్మిటరీ, అదనపు గదుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు తమకు గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆటలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని, గ్రౌండ్‌ను చదును చేసి మట్టి పోయించి ఆటలకు అనువుగా తీర్చిదిద్దాలని విద్యార్థినిలు ఎమ్మెల్యే ను కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, విద్యార్థినుల చదువుతో పాటు వారి ఆరోగ్యం, క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆటలు ఆడుకునేందుకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్‌ను పరిశుభ్రంగా చేసి, అవసరమైన పనులు చేపించి ఆటలకు అనువుగా తీర్చిదిద్దేలా సంబంధిత అధికారులతో మాట్లాడు తాననీ హామీఇచ్చారు.






