ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.
ములకలపల్లి,ఏప్రిల్ 15 (విజయక్రాంతి): జగన్నాధపురం లో ఆర్ అండ్ బి రోడ్డు కిరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి అభివృద్ధికి సహకరించాలని జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ వ్యాపారస్తులను కోరారు.బుధవారం ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు రోడ్ విస్తరణలో భాగంగా రెండవసారి వ్యాపారస్తులకు నోటీసులు అందజేయగా గ్రామ ప్రజలను ఉద్దేశించి సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడారు.జగన్నాధపురం గ్రామంలో మెయిన్ రోడ్డు, పంచాయతీ ఆఫీస్ వరకు ఇరువైపుల ఉన్న వ్యాపారస్తులు గత నెల 6వ తేదీన పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల అధికారులు ఇచ్చినటువంటి నోటీసుకు అనుగుణంగా ఆర్ అండ్ బి పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించగలరని ఆయన మనవి చేసారు.జగన్నాధపురం గ్రామ అభివృద్ధి కొరకై చేస్తున్న ఈ ప్రయత్నానికి మద్దతుగా ఉండాలని కోరారు.ఈ విషయమై మీరు ఎటువంటి సందేహాలు పడాల్సిన అవసరం లేదని అభివృద్ధికి సహకరించి అండగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీం, గ్రామ పెద్దలు,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






