20 June, 2026 | 1:44 AM

రోడ్డు లేకుండా చేసి.. డివైడర్ నిర్మాణం!

20-06-2026 12:15 AM

కేసముద్రం, జూన్ 19 (విజయక్రాంతి): నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా.. కేసముద్రం పట్టణంలో రోడ్లపై డివైడర్ల నిర్మాణ తీరు మారింది. కేసముద్రం పట్టణంలో వందల కోట్ల రూపాయలతో పలు రోడ్ల విస్తరణ పనులను ఏడాది క్రితం చేపట్టారు. అయితే కేవలం మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ఉన్న ఒకే ఒక్క రోడ్డు మాత్రమే పూర్తిస్థాయిలో విస్తరించి రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించారు.

మిగిలిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్, ఆర్టీసీ బస్టాండు నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు, కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి మోహన్ టాకీస్ వరకు చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు అసంపూర్తిగా మారాయి. అనేక చోట్ల రోడ్ల విస్తరణకు వాణిజ్య సముదాయాలు, గృహాల తొలగింపు అడ్డంకి గా మారింది. అయితే అధికారులు రోడ్ల విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించకుండానే,

ఉన్న స్థలంలో రోడ్లు వేయకుండానే కంకర పోసి, డివైడర్లను మాత్రం యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. మొత్తంగా పట్టణంలో విస్తరిస్తున్న అన్ని రోడ్ల లో రోడ్ల పనులను పక్కనపెట్టి, డివైడర్ల నిర్మాణం పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇరువైపులా రోడ్లను విస్తరించకుండానే డివైడర్లను నిర్మిస్తున్నారు. దీనితో ఓవైపు రోడ్డు సరిగా లేక, మరోవైపు విస్తరించకపోవడంతో రోడ్డు పూర్తిగా మూసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. రోడ్లు విస్తరించకుండా, డ్రైనేజీ నిర్మించకుండా, రోడ్డుపై విద్యుత్ లైన్లు తొలగించకుండా డివైడర్లు మాత్రమే నిర్మించడం వల్ల పట్టణంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారి ప్రయాణానికి ఆటంకం మారింది. 

ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు!

అత్యవసర పరిస్థితిలో పట్టణంలో 108 అంబులెన్స్, అగ్నిమాపక యంత్రం ప్రవేశించే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైనా జరగకూడని జరిగితే ‘గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కనే’ పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరించకుండా డివైడర్లు నిర్మించడంతో మోహన్ టాకీస్ నుండి రైల్వే స్టేషన్ ద్వారా పొట్టి శ్రీరాములు సర్కిల్ మీదుగా మహబూబాబాద్ నుండి కేసముద్రం ఆర్టీసీ బస్సులు ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు మీదుగా మళ్ళించారు. దీనితో ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి అటు మోహన్ టాకీస్, ఇటు పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి ఆర్టీసీ బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. 

డివైడర్ల నిర్మాణంలో వివక్ష?

రోడ్డు మధ్యలో డివైడర్ల నిర్మాణంలో పలుచోట్ల వివక్ష చూపుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల వెడల్పుగా, మరి కొన్ని చోట్ల తక్కువ వెడల్పుతో డివైడర్లు నిర్మిస్తున్నారని, దీనివల్ల కొన్నిచోట్ల గృహాలు కొంతమేర తొలగించాల్సిన పరిస్థితి నెలకొందని, ఇంకొన్ని చోట్ల తగ్గించడంతో వారికి ‘మేలు’ చేస్తున్నారని, అంతట ఒకే విధంగా డివైడర్ల విస్తీర్ణం నిర్ధారిస్తే చాలామందికి మేలు కలుగుతుందని, డివైడర్ల నిర్మాణంలో వివక్ష చూపడం సరికాదంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధి ప్రదాతకు అపకీర్తి

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన స్వమండలం కేసముద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులు కాగానే కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి ప్రదాతగా నిలిచారు. అయితే అభివృద్ధి పనులను నిర్వహిస్తున్న అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ పనులను ప్రణాళిక బద్ధంగా నిర్వహించకుండా అడ్డదిడ్డంగా నిర్వహిస్తూ, అభివృద్ధి ప్రదాతకు అపకీర్తి తెచ్చిపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు పనుల్లో ‘ఏకరీతిన’ వ్యవహరించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.