20 June, 2026 | 2:31 AM

గ్రామాభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నిధులు ముఖ్యం

20-06-2026 01:42 AM

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై అవగాహన సదస్సు

ఇంచార్జి ఎంపీడీఓ రాఘవ వెల్లడి

ఇటిక్యాల, జూన్ 19: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారం వినియోగించుకొని గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని ఇన్చార్జ్ ఎంపీడీఓ రాఘవ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు, స్థానిక అధికారులకు 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ రాఘవ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2026-27 నుండి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గాను తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు  రూ. 9,968 కోట్లను కేటాయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నిధుల వినియోగంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నిధులను ’టైడ్’, ’అన్టైడ్’ పద్ధతిలో కేటాయించిన పనులకే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు.

గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, నిధుల దుర్వినియోగానికి తావులేకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సునీల్, ఇటిక్యాల మండల పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మాజీ సర్పంచులు, ప్రత్యేకాధికారులు మరియు మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.