23 April, 2026 | 1:57 AM

మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్‌చేయ్

23-04-2026 12:36 AM
  1. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్టు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు
  2. పిల్లర్లు కుంగితే లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్ చేసిన గోబెల్స్ ప్రచారం బట్టబయలు
  3. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్ల కు వెంటనే మరమ్మతులు చేసి, రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వంపై బురదజల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఎన్నికల ముందు, గడచిన రెండేళ్లుగా కాంగ్రెస్ రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ వచ్చిందన్నారు.

ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే రెండున్నరేళ్ల విలువైన సమయా న్ని వృథా చేశారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రా జెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి అని, అందులో పదుల సంఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని ఆగ్రహం వ్య క్తం చేశారు. హైకోర్టు తాజా తీర్పును స్వాగతిస్తున్నామని, కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధార మని స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో సహా 70 శాతం తెలంగాణకు తాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు అని కొనియాడారు.

రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయా లు చేయకూడదని హితవు పలికారు. నిజానికి ఒక 100, 200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని సూచించారు. కానీ గత రెండున్నరేళ్లుగా ల్యాండ్ అక్విజిషన్‌కు ప్రభు త్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మోటా ర్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కేవ లం కుట్రతోనే ఆపారని విమర్శించారు.

పర్ఫార్మె న్స్ మీద రాజకీయాలు జరగాలని, మాకంటే మం చి సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సూచించారు. ఎన్డీఎస్‌ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి బుద్ధి చెబుతాయని హితవు పలికారు. 

అవినీతిపై ప్రశ్నిన్తున్నందుకే అక్రమ కేసులు

‘అసెంబ్లీ సాక్షిగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను, స్కాములను బయటపెడుతున్నామని, సమాధానం చెప్పుకోలేక మమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా, నేను అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే నా మీద రెండు ఎంక్వైరీలు వేశారు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ప్రతిప క్షాలను వేధించడం, అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

‘మేము కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలిన ఉద్యమకారులం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, వరిధాన్యంలో 5 కిలోల తరుగు తీస్తున్నారు, మొక్కజొన్న, సెనగలు, పొద్దుతిరుగుడు కొనే దిక్కు లేదన్నారు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా పడలేదు.. కరెంట్ లేక రైతులు రోడ్లెక్కినా ఏ ఒక్క మంత్రీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, యాజమాన్యాలు రోడ్డున పడ్డారని, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్ అంధకారంలో పడిందని, రేవంత్‌రెడ్డి ముందు వీటి మీద దృష్టి పెట్టాలని సూచిం చారు. రాజకీయ కాలయాపన చేస్తే ప్రజాక్షేత్రంలో పీఠం కదిలిపోవడం ఖాయమని, భయకంపితులై మాట్లాడుతున్న రేవంత్ మాటలే దీనికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ మాటలకు విలువ లేదు

 కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలకు ఎలాంటి విలువ కూడా లేదని, ముందుగా గోదావరి బనకచర్ల లింక్ ద్వారా తెలంగాణకు జరుగు తున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆంధ్రాకు ప్యాకేజీలు, ప్రాజెక్టులు వస్తుంటే తెలంగాణకు ఏమొస్తుందో సంజయ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వమే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తి స్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపి, జీవో ఇచ్చిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారని, కొత్తవి ఏమీ అడగడం లేదని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథ కం పెట్టి ఆర్టీసీకి ఇవ్వాల్సిన 3 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని, నిధులు లేకపో వడంతో కార్మికులకు డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారని, బడ్జెట్‌లో చూపిస్తు న్నా నిధులు మాత్రం విడుదల చేయడం లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏటా 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చామని, తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.