06-12-2025 12:00:00 AM
స్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరోసారి ప్రజలకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం ఒక ప్రకటన చేసింది. 5.5 శాతం నుంచి 5.25 శాతానికి రెపో రేటు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
జూన్‌లో జరిగిన ఎంపీసీ మీటింగ్‌లో రెపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు. కాగా ఈ సంవత్సరం ఆర్బీఐ వరుసగా నాలుగోసారి రేట్లను తగ్గించడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్లు, జూన్ సమీక్షలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత, తాజాగా మరో 25 బేసిస్ పాయింట్ల కోత వల్ల మొత్తం 2025లో రెపో రేటు 1.25% తగ్గింది. దీనిని నిపుణులు వడ్డీ రేట్లపై ట్రిపుల్ బోనస్‌గా పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్పణం కనిష్ట స్థాయికి పడిపోవడం,వృద్ధి రేటు పెరగడంతో రేట్ల కోత చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల ద్వారా రూ.1 లక్ష కోట్లు విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 8.2% చేరడం, ద్రవ్యోల్బణం 1.7%కు పడిపోవడం సానుకూల సంకేతాలని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లోనే వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశం లభించిందని తెలిపారు. ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ జీడీపీ వృద్ధి అంచనాను 6.8% నుంచి 7.3%కు పెంచిందన్నారు.
గృహ రుణాలు తీసుకున్నవారికి ఆదా
రెపో రేటు తగ్గింపుతో హోమ్‌లోన్ తీసుకున్నవారికి పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది. ఆర్బీఐ 100 బేసిస్ పాయింట్లు రెపో రేటును తగ్గించడంతో వడ్డీ ప్రయోజనాన్ని ఇప్పటికే బ్యాంకులు రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. తాజాగా మరో 25 బేసిస్ పాయింట్లు కూడా తగ్గించడంతో ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుతో ముడిపడిన గృహ రుణాల ఈఎంఐ భారం త్వరలో తగ్గనుంది. రుణ వినియోగదారులకు లాభమే అయినా.. డిపాజిట్‌దారులకు మాత్రం నిరాశ కలుగుతుందనే చెప్పాలి.