బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు
సీఎం దస్త్రానికే దిక్కు లేకపోతే.. కాంగ్రెస్ మాటలు ఎవరు నమ్ముతారు
బహిరంగ వేదికపై సీఎం సంతకం చేసిన దస్త్రం ఏమైంది?
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి జీరో వ్యాల్యూ ఉంది
హైదరాబాద్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ''బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు" అని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) విమర్శించారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ... చరిత్ర నిండా రాజులు దర్పంతో గర్వం ప్రదర్శించారని శిబి చక్రవర్తి చెప్పారు. నేనే రాజు.. నేనే మంత్రి అని మిడిసిపడ్డ వారు సంపద మూటగట్టుకు పోలేరన్నారు. శిబి చక్రవర్తి(Sibi Chakravarthy) అడిగిన కోరికలు తీర్చి.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారని కేటీఆర్ తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే పాలకులకు విశ్వసనీయత ఉంటుందని సూచించారు. ఎవరు వెయ్యి ఏళ్లు ఉండరు.. ఎవరూ శాశ్వతంగా పదవిలో ఉండరు.. మేమూ పదేళ్లు అధికారంలో ఉన్నాం.. ఇప్పుడు విపక్షంలో ఉన్నామని కేటీఆర్ వివరించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి విలువ, విశ్వసనీయత ఉండాలని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఆలోచనలు ప్రతిబింబించాలన్నారు. హామీల దస్త్రంపై ముఖ్యమంత్రి(CM Revanth Reddy) సంతకం చేశారని 2023లో గవర్నర్ ప్రసంగంలో ఉందని, సంతకం చేసి ఏళ్లు గడిచినా సీఎం సంకల్పం, చిత్తశుద్ధి ఏమైంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. తొలి కేబినెట్ లోనే ఆరు ఆహాలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. సీఎం దస్త్రానికే దిక్కు లేకపోతే కాంగ్రెస్ మాటలు ఎవరు నమ్ముతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి జీరో వ్యాల్యూ ఉందని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి నిధులు తెస్తారనుకుంటే.. నిధులు ఇచ్చివస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఢిల్లీకి వెళ్లి నిధులు తెచ్చింది సున్నా అన్నారు. 2023లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 9.46 లక్షలుగా ఉందన్న కేటీఆర్ నిన్న గవర్నర్ ప్రసంగంలో ఐటీలో ఉద్యోగుల సంఖ్య 9.39 లక్షలు చెప్పారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా 7 వేల ఉద్యోగాలు తగ్గాయనేది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు.
ఏ కారణం చేత ఉద్యోగాలు తగ్గాయనేది మంత్రి జవాబివ్వాలని కేటీఆర్ కోరారు. కేందం నుంచి నిధులు తక్కువ వచ్చినా రాష్ట్రాన్ని దీటుగా నిలబెట్టామని కేటీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రంపై ఆధారపడే రాష్ట్రం కాదని కేటీఆర్ వెల్లడించారు. 2023 నాటికి రాష్ట్ర ఆదాయంలో పన్నుల ద్వారా 80 శాతం సాధించిన తొలి రాష్ట్రం, 16 శాతం సీఏజీఆర్ తో దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలబెట్టమన్నారు. 2014 నాటికి రాష్ట్ర సొంత ఆదాయ వనరులు రూ. 29 వేల కోట్లు అన్నారు. 2023 నాటికి రాష్ట్ర సొంత ఆదాయ వనరులు రూ. 1.11 లక్షల కోట్లు అని లెక్క చెప్పారు.
రాష్ట్రాల సొంత ఆదాయ వనరుల్లో తెలంగాణను నంబర్ వన్ గా నిలబెట్టామని కేటీఆర్ తేల్చిచెప్పారు. దాదాపు 300 శాతం వృద్ధిలో తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టామని, ఇవాళ ఆదాయం అంచనాలను ఎందుకు అందట్లేదో తెలియట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా కాలంలోనే అధ్వాన పరిస్థితి.. ఇప్పుడుకాంగ్రెస్ హయాంలో చూస్తున్నామని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పురోగమనం లేదు.. అంత తిరోగమనమే అన్నారు. ఆర్థిక వ్యవస్థను దీక్షతో నడపడం చాలా కష్టమని కేటీఆర్ సూచించారు. ''డే ఎకానమీ డమాల్ అయింది.. నైట్ ఎకానమీ తెస్తామంటున్నారు. మీరు తెచ్చేది ఎకానమీ కాదు.. దారం తెగిన కైట్ ఎకానమీ.. దేశంలో నంబర్ వన్ తలసరి ఎకానమీ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాం'' అని కేటీఆర్ పునరుద్ఘటించారు.




