calender_icon.png 29 July, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నివేదిక రాలె.. పరిహారం అందలె!

29-07-2025 01:37:08 AM

న్యాయం కోసం ‘సిగాచి’ బాధిత కుటుంబాల ఎదురుచూపు

  1. నిపుణుల కమిటీ నివేదికపై స్పష్టత కరువు 
  2. మరో మూడు రోజుల్లో ముగియనున్న గడువు
  3. కంపెనీని కాపాడేందుకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాం తి): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో బాధిత కుటుంబాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ ఘటనలో 45 మంది చనిపోగా, మరో 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు మంత్రులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితుల కుటుంబాల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

దీనికి తోడు ఫ్యాక్టరీల్లో తరుచూ సంభవిస్తున్న ప్రమాదాలపై సమగ్రమైన నివేదిక అందించేందుకు నలుగురు సైంటిస్టులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. సదరు ఘటనలో బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని, భవిష్యత్‌లో ఫ్యాక్టరీల్లో ఈ రకమైన ప్రమాదాలు జరగకుండా నియంత్రించేందుకు అవకాశం లభిస్తుందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ ప్ర మాద ఘటనపై ప్రభుత్వం జూలై 2వ తేదీ న నలుగురు సైంటిస్టులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌ఐఆర్ ఎమిరిటస్ సైంటిస్టు డా.బీ వెంక టేశ్వర్‌రావు అధ్యక్షతన సీఎస్‌ఐఆర్‌లో చీఫ్ సైంటిస్టు డా.టీ ప్రతాప్‌కుమార్, రిటైర్డ్ సైంటిస్టు సూర్యనారాయణ, సేఫ్టీ ఆఫీసర్ సంతోష్ ఘూగేను సభ్యులుగా నియమించింది. సిగాచి ఫ్యాక్టరీలో సంభవించిన ఘ టనకు గల కారణాలు, యాజమాన్యం నిర్ల క్ష్యం, జరిగిన ప్రాణనష్టం, ఫ్యాక్టరీలో ప్ర మాదం జరగకుండా తీసుకున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలపై సమగ్రమై న నివేదికను నెల రోజులలోపు ప్రభుత్వానికి అందజేయాలని సూచించింది. కమిటీ కి ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. కానీ ఇప్పటికీ సిగాచి ఫ్యాక్టరీ ఘటనకు సంబంధించి కమిటీ ఇవ్వాల్సిన నివేదికపై మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదని తెలుస్తోంది. 

పరిహారమూ అందలేదు..

సిగాచి ఘటనపై ప్రత్యేక కమిటీ ఇచ్చే నివేదిక అంశం అటుంచితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారమూ పూర్తిగా అందలేదు. దీంతో బాధిత కుటుంబాలు మరింత నిరాశకు గురవుతున్నాయి. ప్రమాదంలో పూర్తిగా ఆచూకీ కన్పించకుండా పోయిన 8 మంది కుటుంబాలకు మాత్రం సిగాచి కంపెనీ ఒక్కొక్కరికీ రూ.15లక్షల చొప్పున పరిహారం అందించినట్టు సమాచారం. కాగా మిగిలిన వారికి పరిహారం చెల్లించడంలో కంపెనీ నిర్లక్ష్యం వహి స్తున్నదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కూడా పెంచాలని కోరుతున్నారు. ఇందులో భాగం గా సిగాచి కంపెనీ నుంచి రూ.కోటికి మించి అదనంగా పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 

కంపెనీని కాపాడేందుకేనా?

కమిటీ నివేదిక ఇవ్వడానికి ఇంకా మూ డు రోజుల గడువే ఉన్నప్పటికీ ఆలోగా ప్రభుత్వానికి నివేదిక అందడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కమిటీ నివేదిక ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి కారణం బాధితుల పక్షాన సమగ్రమైన న్యాయం చేయడానికా?.. లేక కంపె నీని రక్షించడానికా? అని కొందరు ఆరోపిస్తున్నారు. గడువు సమీపిస్తున్నా నివేదికపై ప్రత్యేక కమిటీ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతు న్నాయి. కమిటీ నివేదిక ఇస్తే వెంటనే సిగాచి కంపెనీ బాధిత కుటుంబాలకు పరిహారంగా ఒప్పుకున్న మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రమాదానికి కారణం కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే అన్న విషయం బయటపడుతుంది. ఈ క్రమంలో కంపెనీకి సంబంధించిన షేర్స్ కూడా పడిపోయే అవకాశం ఉంది. అయితే కంపెనీని రక్షించేం దుకు ప్రభుత్వం కావాలనే నివేదిక విషయం లో జాప్యం చేస్తోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

హెచ్చరించినా కంపెనీ పట్టించుకోలేదు..

సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఒడిశా రాష్ట్రంలోని గంజమ్ జిల్లా వాసి వెంకట్ జగన్‌మోహన్ మృతి చెందారు. ఘటన జరిగిన రోజునే ఆయన కుమారుడు రాజనాల సాయియశ్వంత్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ఫిర్యాదులో సిగాచీ కంపెనీలో జరిగిన ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. కంపెనీలో పాత మిషనరీ అవ్వడంతో ప్రమాదం సంభవిస్తుందని జగన్‌మోహన్ సహా ఇతర కార్మి కులు అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వివరించారు. యాజమాన్యం కావాలనే, ఉద్దేశపూర్వకంగా పాత మిషనరీతో పనిచేయించారని ఆరోపించారు. అలాగే పనిచేస్తే చాలా ప్రాణనష్టం జరుగుతుందని, తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉందని జగన్‌మోహన్ తమ కుటుం బంతో చెప్తూ బాధపడేవారని గుర్తు చేశారు. ప్రమాదానికి కారణమైన కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.