13 August, 2026 | 10:13 PM

రాములవారి గుట్టపై కాషాయ జెండా ఆవిష్కరణ

13-08-2026 09:07 PM

రామగిరి,(విజయ క్రాంతి): శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే కార్యక్రమంలో భాగంగా బేగంపేట్, యువకులు రాములవారి గుట్టపై ఉన్న హనుమాన్ దేవస్థానం వద్ద కాషాయ జెండాను ఎగురవేశారు. బేగంపేట్‌కు చెందిన యువకులు పందుల రామ్, బెజ్జాల మహేష్, కండే సుబ్బు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రీరాముని సేవకుడైన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ దేవస్థానం వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించారు.

రాములవారి గుట్టను భక్తులు రాములవారి ఖిల్లాగా భావిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఈ ప్రాంతాన్ని దర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలివస్తుంటారు. గుట్టపై ఉన్న పురాతన నీటి బావి, ఫిరంగి గుండ్లు, రాములవారి పాదాలు, సీతమ్మవారి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం తదితర చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.శ్రావణమాసం మొదటి రోజున యువకులు గుట్టపైకి వెళ్లి కాషాయ జెండాను ఎగురవేయడం ఎంతో ఆనందకరంగా ఉందని వారు తెలిపారు. శ్రావణమాసం మొత్తం భక్తులు భక్తిశ్రద్ధలతో రాములవారి గుట్టను సందర్శించి, ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు తావులేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని యువకులు కోరారు.