ఆపదలో ధైర్యసాహసాలు
బాలిక ప్రాణాలు కాపాడిన యువకులకు సన్మానం
గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ అభినందనలు
మంథని,(విజయక్రాంతి): బొక్కలవాగులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతున్న బాలికను ధైర్యసాహసాలతో రక్షించిన బోయినిపేటకు చెందిన అంకం శేఖర్, ఆకుల అరవింద్‌లను గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ తన కార్యాలయంలో అభినందించి సన్మానించారు. మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలవాగు వద్ద బోయినిపేటకు చెందిన పర్శవేన రాజు తన కుమార్తె అలేఖ్యతో కలిసి గొర్రెల మందను వాగు దాటించే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో జారిపడ్డాడు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన అలేఖ్య కూడా నీటిలో మునిగిపోతూ కేకలు వేసింది.
అదే సమయంలో అటుగా వెళ్తున్న అంకం శేఖర్ వెంటనే స్పందించి నీటిలోకి దిగి అలేఖ్యను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోవడంతో శేఖర్, ఆకుల అరవింద్ కలిసి ప్రథమ చికిత్స అందించి ఆమెను స్పృహలోకి తీసుకువచ్చారు. అనంతరం అలేఖ్య తన తండ్రి కూడా నీటిలో మునిగిపోయినట్లు చెప్పడంతో ఇద్దరూ వాగులోకి దిగి రాజును బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి బాలికను కాపాడటంతో పాటు ఆమె తండ్రిని రక్షించేందుకు ప్రయత్నించిన శేఖర్, అరవింద్‌ల ధైర్యసాహసాలను ఏసీపీ ఎం.రమేష్ అభినందించారు. ఏసీపీ కార్యాలయంలో మంథని సీఐ బుద్ధె స్వామి,ఎస్‌ఐ సాగర్‌ల సమక్షంలో వారిని శాలువాలతో సత్కరించి,ఆపదలో మానవత్వంతో స్పందించినందుకు అభినందనలు తెలిపారు.ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు సమయస్ఫూర్తితో స్పందించడం అభినందనీయమని, వారి ధైర్యసాహసాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఏసీపీ పేర్కొన్నారు.






