27 June, 2026 | 1:33 AM

కేంద్రమంత్రివర్గం పునఃవ్యవస్థీకరణ?

27-06-2026 12:00 AM
  1. ప్రధాన్, నిర్మలకు స్థానచలనం
  2. పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్‌లకు కీలక శాఖలు
  3. తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్, ఏపీలో ఒకరికి!

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రధాని నరేంద్రమోదీ కేంద్రమంత్రివర్గంలో భారీ మార్పులు చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని కేంద్రమంత్రివర్గాలు పేర్కొన్నాయి. కేంద్రమంత్రి కురియన్ రాజీనామా తరువాత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్రహోంశాఖ మంత్రి కూడా రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు.

నీట్ యూజీ పరీక్షను మళ్లీ విజయవంతంగా నిర్వహించడం పట్ల కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో హర్షం వ్యక్తమైంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌లకు స్థానచలనం తప్పకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. పలువురు కేంద్రమంత్రులకు కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ప్రధాని మోదీ 2029 మిషన్‌ను ఇప్పటినుంచే మొదలు పెట్టినట్లు కూడా భావిస్తున్నారు. 17 మంది మంత్రులకు స్థానచలనం లేదా ఉద్వాసన తప్పకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిర్మలా సీతారామన్‌కు విద్యాశాఖ, ఆమె స్థానంలో పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖను అప్పజెప్పనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వాణిజ్యశాఖ అప్పగించే ఆస్కారం ఉంది. మనోహర్ ఖట్టర్, భూపే్ందర యాదవ్, నితీష్ కుమార్‌లకు కూడా స్థానచలనం తప్పకపోవచ్చు. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్రమంత్రివర్గంలో అవకాశం దక్కే ఛాన్స్ ఉండగా, ఏపీకి సహాయమంత్రి పోస్టు దక్కే ఆస్కారం ఉంది.

అదే సమయంలో ఇటీవలే ఢిల్లీ, పశ్చిమ బంగాల్, మహారాష్ట్రల నుంచి బీజేపీ పలువురు ఉద్ధండ నాయకులు చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చడ్డా సహా ఏడుగురు ఎంపీలు, టీఎంసీ నుంచి 20 మంది ఎన్డీయేకు పూర్తి మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి ఆరుగురు ఎన్డీయే కూటమిలో చేరారు. దీంతో వీరిలో బలమైన నాయకులకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.