రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీరు అందించండి మహాప్రభో
చిమ్ము చీకట్లో కాలం వెల్లదీస్తున్నాం
జిల్లా కలెక్టర్, ఐటీడీఏపీఓ మొరపెట్టుకున్న మర్కగూడ గ్రామ గిరిజనులు
గిరిజనుల సమస్యలు విని చలించిపోయిన కలెక్టర్, పిఓ
కనీస సౌకర్యాలు తీరుస్తామని కలెక్టర్ హామీ
ఉట్నూరులో జిల్లా కలెక్టర్ రాజర్శి షా, పిఓ మంద మకరందుకు గూడెం సమస్యలను కన్నీటితో విన్నవిస్తున్న కీలక కౌసల్య బాయి
గ్రామస్తులు తాగునీరు బాటిల్లు చూపిస్తున్న ముర్కగూడ నివాసి
ఉట్నూర్,(విజయక్రాంతి): కనీస సౌకర్యాలు.. నడిచేందుకు దారి.. గొంతు తడిపేందుకు స్వచ్ఛమైన నీటితో పాటు చిమ్ము చీకట్లో జీవనం సాగిస్తున్నామని గిరిజనులు జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీవో మంద మకరందం ముందు కన్నీటితో తాము ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న గోస ను వెల్లడించారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రానికి జిల్లా కలెక్టర్ వస్తున్న విషయం తెలుసుకున్న ఉట్నూర్ మండలం దొంగ చింత పంచాయతీ పరిధిలోని మార్కా గూడా గ్రామ గిరిజనులు పిఎంఆర్సి భువన కేంద్రానికి చేరుకున్నారు. పీఎంఆర్సి లో నిర్వహించిన అడవి హక్కుల చట్టం సమావేశం ముగించుకొని తిరుగు ప్రయాణమైన జిల్లా కలెక్టర్ ను ముర్కగూడ గ్రామస్తులు కలిశారు.
దొంగ చింతా పంచాయతీ పరిధిలోని మర్కాగూడ గ్రామంలో 20 గిరిజన కుటుంబాల లో 104 చిన్న పెద్దలం జీవనం సాగిస్తున్నామన్నారు. తమ గ్రామానికి పంచాయతీ కేంద్రం నుండి మూడు కిలోమీటర్ల దూరం కాలినడక కు దారి లేదని, మట్టి రోడ్డు వేసుకుందామంటే అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామ గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తమ గూడానికి ఉన్న బోర్వెల్ బావిలో రంగు మారిన నీరు వస్తుందని, ఆ నీటినే తాగుతూ.. అనారోగ్యానికి గురి అవుతున్నామని గ్రామానికి చెందిన కినక కౌసల్యబాయి కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో పాటు ఐటీడీఏ తరపున ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్ పనిచేయకపోవడంతో చిమ్ము చీకట్లో రాత్రి వేళలో భయం భయంతో కాలం వెళ్లదీస్తున్నామని, విషపురుగులతో సాహసం చేస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటూ కన్నీటితో తెలిపారు.
గిరిజనుల సమస్యలను క్షుణంగా విన్న జిల్లా కలెక్టర్ రాజర్శి షా, పిఓ మంద మకరందు మాట్లాడుతూ.. మీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న విద్యుత్ శాఖ ఎస్ ఈ జాదవ్ సుభాష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడే ఉన్న బిర్సాయిపేట్ ఎఫ్ఆర్ఓ తో మాట్లాడుతూ.. కనీసం రాకపోకలకు రోడ్డు వేసుటకు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడంతోపాటు నిధులు మంజూరు చేస్తాం మట్టి రోడ్డు వేసేందుకు అడ్డంకులు కల్పించొద్దని ఎఫ్ఆర్ కు సూచనలు చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.






