9 June, 2026 | 1:12 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యల్ని పరిష్కరించండి

09-06-2026 12:15 AM

రెండు అంబులెన్సులను తిరిగి అందుబాటులోకి తేవాలి

గుండాల, జూన్ 8 (విజయక్రాంతి): మారుమూల ఏజెన్సీ మండలమైన గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కి, మండల వైద్యాధికారికి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవ చైతన్య యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ.. గతంలో పీహెచ్సీ పరిధిలో రెండు అంబులెన్సులు(108 వాహనాలు) ఉండగా ఒకటి మరమ్మత్తులకు గురై అందుబాటులో లేదని, మరొకటి ఇల్లందు మండలానికి బదిలీ చేశారని,

బదిలీ చేసిన అంబులెన్స్ ను తిరిగి మండలానికి కేటాయించాలని, మరమ్మత్తులకు గురైన అంబులెన్సును తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతిపెద్ద మండలమైన గుండాలకు రెండు అంబులెన్సులు అవసరమేనని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అత్యవసర మెడిసిన్ కొరత ఉందని, ప్రజలకు అవసరమైన మెడిసిన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి, పంపిణీ చేయాలని,

ఆసుపత్రిలో స్టాఫ్ తక్కువగా ఉన్నారని, ఇద్దరు స్టాఫ్ నర్స్ లను, ఒక ఫార్మసిస్టును కేటాయించాలని, మారుమూల గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా, దోమ తెరలను వెంటనే పంపిణీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నవ చైతన్య యువజన సంఘం నాయకులు సంతోష్, నరేష్, వినయ్, ప్రసాద్, సతీష్, వీర కుమార్, సమ్మయ్య, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.